Krsnamma
-
కృష్ణమ్మ పుష్కర శోభ
-
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు
►మూడు రోజుల్లో50 టీఎంసీలు ►45 టీఎంసీల నుంచి 95 టీఎంసీలకు పెరిగిన నీటి నిల్వ ►నాగార్జున సాగర్‌కు 9 వేల క్యూసెక్కులు విడుదల సాక్షి, హైదరాబాద్: శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులెడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి నీటి ప్రవాహ జోరు కొనసాగుతోంది. మూడు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి సుమారు 50 టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో కేవలం 45 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ ఒక్కసారిగా 95 టీఎంసీలకు (ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు) పెరిగింది. ఆదివారం ఉదయం 2,28,189 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదవగా రాత్రికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద నీరు వస్తుండటంతో కృష్ణా పుష్కరాల అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద 9,386 క్యూసెక్కుల నీటిని వదులుతోంది. ఎగువన ప్రవాహాలు తగ్గుముఖం.. ఎగువ కర్ణాటకలో వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లో ప్రవాహాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నాలుగు రోజుల కిందట వరకు 2 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు నమోదవగా ఆదివారానికి అవి 1,62,706 లక్షల క్యూసెక్కులకు తగ్గాయి. అయితే ఆ మొత్తం నీటిని దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఆల్మట్టి వాస్తవ నీటిమట్టం 1,705 అడుగులుకాగా ప్రస్తుతం 1,700 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129.7 టీఎంసీలకుగాను ప్రస్తుతం 108.08 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మరోవైపు నారాయణపూర్ సైతం పూర్తిగా నిండటంతో ప్రాజెక్టు నుంచి 1,62,466 క్యూసెక్కుల నీటిని దిగువ కు వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన జూరాలకు వస్తోంది. జూరాల సైతం నిండుగా ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలానికి వదులుతున్నారు. -
కృష్ణమ్మకు వెంకన్న సారె
తిరుమల నుండి పుష్కర యాత్ర ప్రారంభం తిరుమల: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సారె తరలి వెళ్లింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో కూడిన కల్యాణరథంలో బుధవారం ఈ సారెను పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలోని నమూనా ఆలయంలో ఈ నెల 7 నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ కల్యాణరథం 5న విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది. -
కృష్ణమ్మ చెంత.. తాగునీటి చింత
ఈ నగరానికి ఏమైంది!? - అరకొరగా మంచినీటి సరఫరా - కాటేస్తున్న నీటి కాలుష్యం - నీటి వృథాను అరికట్టలేని అధికారులు విజయవాడ సెంట్రల్ : కృష్ణమ్మ చెంతనే ఉన్నా నగరంలో దాహం కేకలు తప్పడం లేదు. మంచినీళ్లు అరకొరగానే అందుతున్నాయని శివారు ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు. పాయకాపురం, సింగ్‌నగర్, పూర్ణానందంపేట, మధురానగర్, మొగల్రాజపురం తదితర ప్రాంతాల్లో కుళాయిల నుంచి వస్తున్న సన్నటి నీటి ధారలు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కొండప్రాంతాలు, జక్కంపూడి వైఎస్సార్ కాలనీల్లో ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తున్నారు. భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం మహిళలు మండుటెండల్లో బిందెలతో ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి. ఎండలు అదరగొడుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలు మరింతగా పెరిగాయి. ట్యాంకర్ల ద్వారా ఇచ్చే నీరు చాలడం లేదని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. అన్నీ కాకిలెక్కలే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం 164 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలో చేయని విధంగా నగరంలో నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అవన్నీ కాకిలెక్కలే అని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరి గిన కౌన్సిల్ సమావేంలో పాలక, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన నీటి ఎద్దడి అంశంపై ఇంజినీరింగ్ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. కాలుష్యం కాటు.. నీటి సరఫరా కోసం రూ. 27 కోట్లను నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యమైన నీరు ప్రజలకు అందడం లేదు. రంగుమారిన, పురుగులున్న నీరు కుళాయిల ద్వారా వస్తోంది. రామలింగేశ్వరనగర్లో రూ.25 కోట్లతో నిర్మించిన 10 ఎంజీడీ ప్లాంటు అధ్వానంగా మారింది. ప్లాంట్ నుంచి నదీగర్భంలోకి విడుదల చేసే మురుగునీరు దిగువకు వెళ్లకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అడ్డుచెప్పడంలో ప్లాంట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే రక్షిత మంచినీటితో మురుగునీరు మిళితం కావడంతో ఆ ప్లాంట్ పరిధిలోని నాలుగు లక్షల మంది ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో రక్షిత నీటి సరఫరా పథకాల ఏర్పాటు కోసం రూ.110 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి కార్యరూపం దాలిస్తేనే కాలుష్య సమస్య తీరుతుంది. నీటి సరఫరా ఇలా.. హెడ్ వాటర్ వర్క్స్‌లోని 16, 11, 8, 5 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ పర్డే) ప్లాంట్ల ద్వారా రోజుకు 40 ఎంజీడీ సామర్థ్యానికి గాను 36 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. గంగిరెద్దులదిబ్బ వద్ద 10 ఎంజీడీ ప్లాంటు ద్వారా రోజుకు 2.50 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఉత్పత్తి అవుతున్న మంచినీటిలో 20 శాతం వృథాగా 36 ఎంజీడీ (164 ఎంఎల్డీ) మంచినీటిని 62 రిజర్వాయర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు నగరపాలక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నీటి వృథాను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సర్కిల్ 3 పరిధిలోని పలు ప్రాంతాల్లో కుళాయిలకు హెడ్స్ లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ పరిష్కారం కావడం లేదు. -
కృష్ణమ్మ కళకళ
ఆలమట్టి, నారాయణపుర నుంచి నీటి విడుదల పశ్చిమ కనుమల్లోభారీ వర్షాలు జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆలమట్టి జలాశయం గరిష్ట మట్టానికి చేరుకోవడంతో మంగళవారం లక్షా పది వేల 500 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఇన్‌ఫ్లో లక్షా ఎనిమిది వేల 501 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గరిష్ట నీటి మట్టం 519.6 మీటర్లు కాగా కేంద్ర జల సంఘం మార్గదర్శకాల మేరకు జలాశయం భద్రత దృష్ట్యా నీటి మట్టాన్ని 518.8 మీటర్లకు పరిమితం చేశారు. జలాశయం సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలతో పాటు కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో భారీ వర్షాలు పడుతుండడంతో ఇన్‌ఫ్లో ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. దీనికి తోడు ఎగువన మహారాష్ట్రలోని డ్యాంల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంతో పాటు విద్యుదుత్పత్తికి ఔట్‌ఫ్లో పరిమాణాన్ని మరో 20 వేల క్యూసెక్కులు పెంచారు. ప్రస్తుతం 270 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోంది. నారాయణపూర్ డ్యాంలోనూ సుమారు పూర్తి స్థాయిలో నీరు చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, విజయవాడ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. నిన్నటివరకు పైనుంచి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో 12 అడుగులు ఉండాల్సిన నీటిమట్టం 9.3 అడుగులకు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి వస్తున్న వరద నీటితో మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగింది. బ్యారేజీలో నీటిమట్టం 12 అడుగులు దాటడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఒక్కో గేటు ఎత్తుతూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతానికి మొత్తం 70 గేట్లను ఎత్తి 81,125 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 45 గేట్లను రెండు అడుగుల మేర, 25 గేట్లను ఒక అడుగుమేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి లక్షా 50 వేల క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండిపోవడంతో వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నాగార్జున సాగర్‌నుంచి దిగువకు లక్షా 99 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు లక్షల 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, దిగువకు మూడు లక్షల 90 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు మూడు లక్షల 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో తగ్గితే ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో రెండు లక్షల క్యూసెక్కుల కన్నా ఎక్కువ వరద వచ్చే అవకాశం కనపడటం లేదు.