కృష్ణమ్మ కళకళ
- ఆలమట్టి, నారాయణపుర నుంచి నీటి విడుదల
- పశ్చిమ కనుమల్లోభారీ వర్షాలు
- జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆలమట్టి జలాశయం గరిష్ట మట్టానికి చేరుకోవడంతో మంగళవారం లక్షా పది వేల 500 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఇన్‌ఫ్లో లక్షా ఎనిమిది వేల 501 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గరిష్ట నీటి మట్టం 519.6 మీటర్లు కాగా కేంద్ర జల సంఘం మార్గదర్శకాల మేరకు జలాశయం భద్రత దృష్ట్యా నీటి మట్టాన్ని 518.8 మీటర్లకు పరిమితం చేశారు. జలాశయం సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110 టీఎంసీల నిల్వ ఉంది.
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలతో పాటు కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో భారీ వర్షాలు పడుతుండడంతో ఇన్‌ఫ్లో ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. దీనికి తోడు ఎగువన మహారాష్ట్రలోని డ్యాంల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంతో పాటు విద్యుదుత్పత్తికి ఔట్‌ఫ్లో పరిమాణాన్ని మరో 20 వేల క్యూసెక్కులు పెంచారు. ప్రస్తుతం 270 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోంది. నారాయణపూర్ డ్యాంలోనూ సుమారు పూర్తి స్థాయిలో నీరు చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.