alamatti reservoir
-
ఆలమట్టిలోకి ఒక్కరోజే 16 టీఎంసీలు
* 70 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ * తుంగభద్రకు భారీగా ప్రవాహాలు * మరో పది రోజుల్లో దిగువకు కృష్ణమ్మ పరుగులు! సాక్షి, హైదరాబాద్: ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి జలక ళను సంతరించుకుంటోంది. బుధవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి ఏకంగా 16 టీఎంసీల మేర నీరొచ్చి చేరింది. గురువారం సైతం 1.75 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండటం, ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతుండటంతో ఐదారు రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ నెలాఖరుకు ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువన ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. తుంగభద్రకు కూడా ప్రవాహాలు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 2 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. ఆలమట్టిలోకి మరో 50 టీఎంసీల నీరు చేరితే దిగువన ఉన్న నారాయణపూర్‌కు నీటిని వదిలే అవకాశాలున్నాయి. నారాయణపూర్ నిండిన వెంటనే జూరాలకు నీటి ప్రవాహాలు మొదలు కానున్నాయి. దిగువకు ప్రవాహాలు వచ్చేందుకు పది రోజులకు మించి సమయం పట్టకపోవచ్చని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. గోదావరి తగ్గుముఖం భద్రాచలం: గోదావరి నీటి ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి నీటిమట్టం 42.5 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడం, దిగువన ఉన్న కిన్నెరసాని, శబరి నదుల్లో వరద తాకిడి లేకపోవడంతో గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. భద్రాచలం డివిజన్లోని పలు మండలాల్లో రోడ్లపై నీటి ఉధృతి తగ్గింది. రాకపోకలు ప్రారంభం కాగా.. భద్రాచలంలోని స్నానఘట్టాలు, కల్యాణకట్ట కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. స్లూయిజ్ లీకేజీ ద్వారా నీరు బయటకు వచ్చి ఇళ్లు మునగటంతో గోదావరి తగ్గినప్పటికీ ఇంకా కొంత మేర అలాగే నీరు నిలిచిపోయింది. శుక్రవారం నాటికి వరద మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ... తగ్గిన ఇన్‌ఫ్లో బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి గురువారం వరద నీరు తగ్గుముఖం పట్టింది. క్రితం రోజు 58 వేల క్యూసెక్కులు వచ్చి చేరిన వరద నీరు 19,344 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్ట్ నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1062.30 అడుగులు (16.34 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుత సీజన్లో 12 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 15 అడుగుల నీటి మట్టం పెరిగిందన్నారు. -
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు..
శ్రీశైలం/గద్వాల/సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఎట్టకేలకు శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువనున్న శ్రీశైలానికి బుధవారం సాయంత్రం నీరు విడుదలైంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో జూరాల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదనను అధికారులు ప్రారంభించారు. తద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 52.0555 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 832.40 అడుగులుగా నమోదైంది. ఆలమట్టి నుంచి స్థిరంగా ఔట్ ఫ్లో.. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయం నుంచి దిగువకు ఔట్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం లక్షా పదివేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయంలో నీటిమట్టాన్ని 518.6 (గరిష్టం 519.6) మీటర్ల వద్ద కొనసాగిస్తున్నారు. మొత్తం 26కుగాను 16 గేట్లను ఎత్తివేశారు. దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,09,889 క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టులో 25 క్రస్టుగేట్లను 0.75 మీటర్లు తెరచి దిగువ నదిలోకి 96,295 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు 99,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల రిజర్వాయర్ గరిష్టస్థాయికి చేరడంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను గురువారం తెరిచే అవకాశముంది. స్థిరంగా అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. రేపు విజయవాడకు సచిన్ రాక సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ ఎంజీ రోడ్డులో రూ.125 కోట్లతో నిర్మించిన పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఉదయం ప్రఖ్యాత క్రికెటర్, ఎంపీ, భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రారంభించనున్నారు. బుధవారం పీవీపీ గ్రూప్స్ మేనేజింగ్ డెరైక్టర్ పొట్లూరి సాయిపద్మ ఈమేరకు వివరాలను వెల్లడించారు. -
కృష్ణమ్మ కళకళ
ఆలమట్టి, నారాయణపుర నుంచి నీటి విడుదల పశ్చిమ కనుమల్లోభారీ వర్షాలు జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆలమట్టి జలాశయం గరిష్ట మట్టానికి చేరుకోవడంతో మంగళవారం లక్షా పది వేల 500 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఇన్‌ఫ్లో లక్షా ఎనిమిది వేల 501 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గరిష్ట నీటి మట్టం 519.6 మీటర్లు కాగా కేంద్ర జల సంఘం మార్గదర్శకాల మేరకు జలాశయం భద్రత దృష్ట్యా నీటి మట్టాన్ని 518.8 మీటర్లకు పరిమితం చేశారు. జలాశయం సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలతో పాటు కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో భారీ వర్షాలు పడుతుండడంతో ఇన్‌ఫ్లో ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. దీనికి తోడు ఎగువన మహారాష్ట్రలోని డ్యాంల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంతో పాటు విద్యుదుత్పత్తికి ఔట్‌ఫ్లో పరిమాణాన్ని మరో 20 వేల క్యూసెక్కులు పెంచారు. ప్రస్తుతం 270 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోంది. నారాయణపూర్ డ్యాంలోనూ సుమారు పూర్తి స్థాయిలో నీరు చేరుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.