ఈ నగరానికి ఏమైంది!?
- అరకొరగా మంచినీటి సరఫరా
- కాటేస్తున్న నీటి కాలుష్యం
- నీటి వృథాను అరికట్టలేని అధికారులు
విజయవాడ సెంట్రల్ : కృష్ణమ్మ చెంతనే ఉన్నా నగరంలో దాహం కేకలు తప్పడం లేదు. మంచినీళ్లు అరకొరగానే అందుతున్నాయని శివారు ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు. పాయకాపురం, సింగ్‌నగర్, పూర్ణానందంపేట, మధురానగర్, మొగల్రాజపురం తదితర ప్రాంతాల్లో కుళాయిల నుంచి వస్తున్న సన్నటి నీటి ధారలు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కొండప్రాంతాలు, జక్కంపూడి వైఎస్సార్ కాలనీల్లో ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తున్నారు. భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం మహిళలు మండుటెండల్లో బిందెలతో ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి. ఎండలు అదరగొడుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలు మరింతగా పెరిగాయి. ట్యాంకర్ల ద్వారా ఇచ్చే నీరు చాలడం లేదని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు.
అన్నీ కాకిలెక్కలే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం 164 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలో చేయని విధంగా నగరంలో నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అవన్నీ కాకిలెక్కలే అని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరి గిన కౌన్సిల్ సమావేంలో పాలక, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన నీటి ఎద్దడి అంశంపై ఇంజినీరింగ్ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు.
కాలుష్యం కాటు..
నీటి సరఫరా కోసం రూ. 27 కోట్లను నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యమైన నీరు ప్రజలకు అందడం లేదు. రంగుమారిన, పురుగులున్న నీరు కుళాయిల ద్వారా వస్తోంది. రామలింగేశ్వరనగర్‌లో రూ.25 కోట్లతో నిర్మించిన 10 ఎంజీడీ ప్లాంటు అధ్వానంగా మారింది. ప్లాంట్ నుంచి నదీగర్భంలోకి విడుదల చేసే మురుగునీరు దిగువకు వెళ్లకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అడ్డుచెప్పడంలో ప్లాంట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే రక్షిత మంచినీటితో మురుగునీరు మిళితం కావడంతో ఆ ప్లాంట్ పరిధిలోని నాలుగు లక్షల మంది ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో రక్షిత నీటి సరఫరా పథకాల ఏర్పాటు కోసం రూ.110 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి కార్యరూపం దాలిస్తేనే కాలుష్య సమస్య తీరుతుంది.
నీటి సరఫరా ఇలా..
హెడ్ వాటర్ వర్క్స్‌లోని 16, 11, 8, 5 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ పర్‌డే) ప్లాంట్ల ద్వారా రోజుకు 40 ఎంజీడీ సామర్థ్యానికి గాను 36 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. గంగిరెద్దులదిబ్బ వద్ద 10 ఎంజీడీ ప్లాంటు ద్వారా రోజుకు 2.50 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఉత్పత్తి అవుతున్న మంచినీటిలో 20 శాతం వృథాగా 36 ఎంజీడీ (164 ఎంఎల్‌డీ) మంచినీటిని 62 రిజర్వాయర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు నగరపాలక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నీటి వృథాను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సర్కిల్ 3 పరిధిలోని పలు ప్రాంతాల్లో కుళాయిలకు హెడ్స్ లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ పరిష్కారం కావడం లేదు.
కృష్ణమ్మ చెంత.. తాగునీటి చింత
Published Mon, May 11 2015 4:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement