తాగునీటి కోసం రాస్తారోకో
► సబ్ కలెక్టర్ హామీ ఇస్తేనే విరమిస్తాం
►5గంటలపాటు పేటలో ఆందోళన
నారాయణపేట రూరల్: పాలకుల నిర్లక్ష్యంతోనే పట్టణంలో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని.. తమ వార్డు కౌన్సిలర్ ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. మున్సిపాలిటీ పాలకపక్షంపై నమ్మకం లేదని.. సబ్ కలెక్టర్ వచ్చి నీటి ఎద్దడి తీరుస్తామని హామీ ఇచ్చేవరకు వెనక్కితగ్గే ప్రసక్తి లేదని పట్టణంలోని 23వ వార్డు ప్రజలు రాస్తారొకో చేపట్టారు. మండుటెండలో 5గంటలపాటు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 8గంటలకు సుభాష్‌రోడ్డుకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, పక్కనే ఉన్న 1, 20వార్డు ప్రజలు అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. కాలనీవాసులు మాట్లాడుతూ చాలారోజులుగా నీటి సమస్య ఉందని, పాలకుల నిర్లక్ష్యం, తప్పుడు నిర్ణయాలతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని విమర్శించారు. 15రోజుల నుంచి ఒక్కసారి కూడా నీళ్లు ఇవ్వలేదని, దాతల సహకారంతో నడుస్తున్న ట్యాంకర్లు సైతం పక్కవార్డులకు సరఫరా చేసి తమకు పంపడంలేదని వాపోయారు. మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చి చెప్పినా వినేదిలేదని, సబ్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే రాస్తారొకో విరమిస్తామని తేల్చి చెప్పారు.
విషయం తెలుకుని కౌన్సిలర్ అక్కడికి చేరుకోగా పోలీసులతో కలిసి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కాలనీవాసులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆయన చేసేదిలేక వారితో కలిసి రాస్తారోకోలో కూర్చున్నాడు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి జోక్యం చేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి మున్సిపల్ చైర్‌పర్స¯ŒS గందె అనసూయ ఆమె భర్త చంద్రకాంత్‌తో కలిసి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. వారం రోజులు సమయం ఇవ్వాలని సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో సత్యనారాయణ చౌరస్తాలో ఆందోళన చేద్దామని, దీనికి తాను ముందుండి పోరాడుతానని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు.