బిరబిరా కృష్ణమ్మ
Published Fri, Aug 9 2013 1:24 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
సాక్షి, విజయవాడ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. నిన్నటివరకు పైనుంచి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో 12 అడుగులు ఉండాల్సిన నీటిమట్టం 9.3 అడుగులకు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి వస్తున్న వరద నీటితో మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగింది. బ్యారేజీలో నీటిమట్టం 12 అడుగులు దాటడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఒక్కో గేటు ఎత్తుతూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతానికి మొత్తం 70 గేట్లను ఎత్తి 81,125 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 45 గేట్లను రెండు అడుగుల మేర, 25 గేట్లను ఒక అడుగుమేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి లక్షా 50 వేల క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండిపోవడంతో వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
గురువారం ఉదయం నాగార్జున సాగర్‌నుంచి దిగువకు లక్షా 99 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు లక్షల 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, దిగువకు మూడు లక్షల 90 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు మూడు లక్షల 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో తగ్గితే ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో రెండు లక్షల క్యూసెక్కుల కన్నా ఎక్కువ వరద వచ్చే అవకాశం కనపడటం లేదు.
Advertisement
Advertisement