దేశం కోసం ‘పరుగు’
కవాడిగూడ/ ఖైరతాబాద్, న్యూస్‌లైన్: యువత, విద్యార్థి లోకం దేశభక్తితో పులకించింది. స్వామి వివేకానంద చికాగో సభలో ప్రసంగించిన రోజును పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన ‘రన్ ఫర్ ది నేషన్’ ఉత్సాహంగా సాగింది. స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ పరుగులో భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. అయితే పరుగుకు ట్యాంక్‌బండ్‌పై అనుమతి లేదంటూ బీజేపీ కార్యకర్తలు, వివేకానంద అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు.
వాహనాల్లో లుం బినీ పార్కు వద్దకు తరలించారు. అంతకుముందు బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హిందూ ధర్మ విశిష్టతను వివేకానందుడు ప్రపంచానికి చాటిన రోజిదని దత్తాత్రేయ కొనియాడారు. సీనియర్ న్యాయవాది రామచందర్‌రావు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా సాగిన పరుగు నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాజీ డీజీపీ అరవిందరావు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు శ్యాంకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రామకృష్ణమఠం స్వామి జ్ఞానానందమయ పాల్గొన్నారు.