
'నన్ను గదిలో పెట్టి రాజకీయం చేశారు'
గుంటూరు : తెలుగుదేశం పార్టీలో డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పుష్పరాజ్ అన్నారు. సీనియర్లను విస్మరించి కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి పదవులిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీటు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నాటి టీడీపీకీ, ఇప్పటి టీడీపీకి ఎంతో తేడా ఉందని పుష్పరాజ్ అన్నారు. తనకు రాజ్యసభ సీటు వస్తుందని ఆశించానని, రాకపోవడంతో నిరాశకు గురైనట్లు ఆయన తెలిపారు.
సీటు దక్కపోవడాన్ని తన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని పుష్పరాజ్ తెలిపారు. తనను గదిలో పెట్టి రాజకీయం చేశారని పుష్పరాజ్ వ్యాఖల్యు చేశారు. పదవుల విషయంలో తనను ప్రతిసారి బాధపెడుతున్నారని ఆయన అన్నారు. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పుష్పరాజ్ తనకు రాజ్యసభ సీటు కేటాయించాలంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు మాత్రం మొండిచెయ్యి మిగిలింది. టీడీపీ నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ తరఫున కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.