
సెటిల్‌మెంట్లలో కేసీఆర్ కుటుంబం: యాష్కీ
సాక్షి, హైదరాబాద్: భూముల సెటిల్‌మెంట్లలో సీఎం కేసీఆర్ కుటుంబం మునిగిపోయిందని మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన సోమవారం మాట్లాడుతూ కేసీఆర్ కూతురు భూముల సెటిల్‌మెంట్లు, అల్లుడు ఇసుక దోపిడీ, కొడుకు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ దేశంలోనే భారీ కుంభకోణమన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందం జరిగిపోయినట్టుగా గతంలో ప్రచారం చేసిన కేసీఆర్‌ను గాడిదలపై ఊరేగించాలన్నారు.
కేసీఆర్ సన్నిహితునితో జరిగిన వివాదం వల్లనే నయీమ్‌ను పోలీసులతో కాల్చి చంపించారని యాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో కలసి కేసీఆర్ కుటుంబం బినామీ వ్యాపారాలు చేస్తున్నదన్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.