తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ట్రక్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. బైక్ పై దంపతులు, వారి ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో వెళ్తుండగా ట్రక్ వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో ఈ ప్రమాదంలో ట్రక్ కింద ఇరుక్కుపోయి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులను మహమ్మద్ ఆజాద్(37), అమన్(9), అషివియ, అలినా లుగా గుర్తించారు. అజాద్ భార్య ఇమ్రానాను గాంధీ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
మంత్రి కేటీఆర్ అధికారుల కంటే ముందుగానే ప్రమాదస్థలానికి చేరుకున్నారు. అధికారులు, పోలీసులను సహాయ చర్యల కోసం అప్రమత్తం చేశారు. ఓ పాపకు సీరియస్‌గా ఉండటంతో కేటీఆర్ స్వయంగా పాపను కారులో చికిత్స కోసం తీసుకెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే తన సిబ్బందితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని అత్యవసర చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు ప్రమాదం ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబానికి సాయం చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబంలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.