అంబర్‌పేట వద్ద...నాలుగు వరుసల వంతెన
- కిలోమీటరున్నర పొడవు.. మూడు కూడళ్ల మీదుగా నిర్మాణం
- కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతి
సాక్షి, హైదరాబాద్: బండి కదలటమే గగనంగా, నగరంలో వాహనదారులకు నరకం చూపుతున్న అంబర్‌పేట రోడ్డు కష్టాలకు తెర పడబోతోంది. ఈ రోడ్డుపై మూడు కూడళ్లను దాటేందుకు వీలుగా నాలుగు వరుసలతో భారీ వంతెన రూపుదిద్దు కోనుంది. కిలోమీటరున్నర పొడవుండే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతించింది. గోల్‌నాక కూడలి వద్ద ఉన్న సేలం బైబిల్ చర్చి దగ్గర ప్రారంభమై అంబర్‌పేట మార్కెట్ కూడలి దాటినతర్వాత ఉండే ముకరం హోటల్ వద్ద ముగిసే ఈ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.338 కోట్లు ఖర్చవుతుందని రోడ్లు భవనాల శాఖ అంచనా వేస్తోంది. ఇది జాతీయ రహదారి నం.202 కావటంతో ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఇందులో వంతెన నిర్మాణానికి కేవలం రూ.111.71 కోట్లు మాత్రమే ఖర్చు కానుండగా మిగతా మొత్తం భూ సేకరణకు ఖర్చు చేయనున్నారు.
పాత ప్రణాళికే...
హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ పెద్ద సవాల్‌గా మారింది. మతపరమైన నిర్మాణాలు, శ్మశానవాటి కలుంటే విస్తరణ అసాధ్యమవుతోంది. అంబర్‌పేట లో రోడ్డుకు రెండువైపులా ముస్లిం శ్మశానవాటిక ఉంది. శ్రీరమణ థియేటర్ సమీపంలో రోడ్డు మరీ ఇరుగ్గా ఉండటం, రెండు వైపులా సమాధులుండ టంతో అక్కడ నిత్యం ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉంటున్నాయి. రోడ్డు విస్తరణకు అవకాశం లేకుం డా పోవడంతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చాలా కాలం క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది జాతీయ రహదారి కావటంతో కేంద్రానికి ప్రతిపాదించింది. ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలసి ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు దీనికి కేంద్రం అనుమతించింది. శనివారం ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలోనే పనులు మొదలుపెట్టి ఏడాదిన్నరలో ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా...
దాదాపు 49 లక్షల వాహనాలతో హైదరాబాద్ నగరం కిక్కిరిసిపోయింది. వాహనాల పెరుగుదల రేటు 16 శాతంగా ఉండటంతో ఏయేటికాయేడు ట్రాఫిక్ చిక్కులు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు నగర వైశాల్యంలో కనీసం 20 శాతంగా ఉండాల్సిన రోడ్ల వాటా కేవలం 12 శాతానికే పరిమితమైంది. దీనికి తోడు రోడ్ల నిర్మాణంలో ప్రణాళికలు లేకపోవటం, రోడ్లపైకే ఇళ్ల నిర్మాణాలు రావటం, కొత్త కాలనీల్లో కూడా విశాలమైన రోడ్లులేకపోవటం, దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోవటంతో సమీప భవిష్యత్తులో సమస్య మరింత తీవ్రం కాబోతోంది. ప్రస్తుతానికి వంతెనల నిర్మాణం, కూడళ్లను విశాలం చేయటానికే ప్రభుత్వం పరిమితమైంది. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) ఫేజ్–1లో రూ.2,631కోట్లు, ఫేజ్–2లో రూ.6,487 కోట్లు, ఫేజ్Œ –3 లో 3,625 కోట్లు, ఫేజ్–4లో రూ.5,100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది.
వాహనాల మళ్లింపు సమస్య..
అంబర్‌పేట రోడ్డు పనులు ప్రారంభిస్తే వాహనాలను మళ్లించటం అంతసులువుగా కనిపించటంలేదు. ప్రత్యామ్నాయ రోడ్లు సరిగా లేకపో వటంతో... మళ్లించే వాహనాలు చుట్టూ తిరిగివెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు చాదర్‌ఘాట్ వద్ద మెట్రో పనులు పూర్తి కావటానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో వాహనా లను మళ్లిస్తే ఆ రోడ్డుపై తీవ్ర ఇబ్బంది నెలకొం టుంది. దీంతో ఆ పనులు పూర్తయ్యాక గాని మళ్లింపు సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. అదే జరిగితే వంతెన పనులు ఆలస్యం కావచ్చని అనుకుంటున్నారు.