
సినీ దిగ్గజానికి ‘శోక్ శస్త్ర్’
పది నిమిషాల ‘కార్వాయ్’ నిర్వహించిన పోలీసులు
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
సిటీబ్యూరో: సినీ దిగ్గజం దాసరి నారాయణరావు పార్థివ దేహానికి మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో బుధవారం మధ్యాహ్నం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిటీ పోలీస్ పరిధిలోని సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్స్‌కు చెందిన సిబ్బంది ఈ సంప్రదాయాలు నిర్వహించారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) తొట్టిపొతల అశోక్, ఆర్‌ఎస్సై రామారావు నేతృత్వంలో 10 మంది సిబ్బంది, మరో 12 మందితో కూడిన పోలీసు బ్యాండ్ మరో ఇద్దరు బిగ్లర్స్‌తో కలిసి మొత్తం 26 మంది పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న వారితో పాటు జాతికి ఎనలేని సేవలు చేసిన వారికి ఈ తరహా లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ అశోక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇదే తాను నిర్వహించిన తొలి కార్వాయ్ అని, ఎంతో బాధతో ఈ విధులు నిర్వర్తించినట్లు తెలిపారు.
లాంఛనాలు ఇవీ
ఝ ప్రభుత్వం తరఫున ఓపెన్ టాప్ ట్రక్‌ను పూర్తిస్థాయిలో పూలతో అలంకరించి తీసుకువస్తారు. తుపాకులతో ఉండే ఫైరింగ్ పార్టీలో 10 మంది, పార్థివ దేహాన్ని మోసే బేరర్ పార్టీలో 10 మంది ఉంటారు.
►ఇందులో పాల్గొనే సిబ్బంది ఫుల్ యూనిఫామ్‌లో ఉండటంతో పాటు వీరి తుపాకులు (.303 రైఫిల్స్) సైతం ఫుల్ వెపన్‌గా పిలిచే కత్తితో సహా ఉంటాయి.
►సదరు వ్యక్తి జాతికి చేసిన సేవలు, ప్రభుత్వం నుంచి అందుకున్న అవార్డులను గౌరవిస్తూ ఇంటి వద్ద పార్థివదేహానికి ఫైరింగ్ పార్టీ గార్డ్ ఆఫ్ హానర్ పేరిట గౌరవ వందన సమర్పిస్తుంది.
► అనంతరం బేరర్ పార్టీ మృతదేహాన్ని తమ భుజాలపై ఎత్తుకుని లయబద్ధంగా నడుస్తూ అంతిమ సంస్కారాలు చేసే ప్రాంతానికి తీసుకువెళతారు. దీన్ని ‘ధీరే చల్’ అంటారు.
►దాసరి నారాయణరావుæ ఇంటికి, అంత్యక్రియలు జరిగిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ఇంటి దగ్గర నుంచి 200 మీటర్లు, అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి 200 మీటర్ల దూరం నుంచి ‘ధీరే చల్’ నిర్వహించారు.
►అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం ప్రవేశ ద్వారం దగ్గర ఇరుపక్కలా నిల్చునే పోలీసులు తమ తుపాకుల్ని తలకిందులుగా పెట్టి బాధను వ్యక్తీకరిస్తూ లోపలకు పంపుతారు.
►పార్థివ దేహాన్ని చితిపై పెట్టి కట్టెలు పేరుస్తున్న సమయంలోనూ మరోసారి గార్డ్ ఆఫ్ హానర్‌తో పాటు తుపాకుల్ని లయ బద్ధంగా తిప్పుతూ ‘సలామీ శ్రస్త్ర్’గా పిలిచే ప్రత్యేక సెల్యూట్ చేస్తారు. ఈ సందర్భంలో నేతృత్వం వహించే ఆర్‌ఐ ముందుండగా... మిగిలిన వారు రెండు వరుసల్లో నిల్చుంటారు.
► కట్టెలు పేర్చడం సలామీ శస్త్ర్ పూర్తయిన తరవాత తుపాకులకు ఉండే కత్తిని తీసి బెల్ట్‌కు ప్రత్యేకంగా ఉండే అరలో పెట్టుకుంటారు.
►చితికి నిప్పుపెట్టే ముందు గాల్లోకి మూడు రౌండ్లు చొప్పున కాల్పులు జరిపి రెండు నిమిషాల పాటు మౌనం వహిస్తారు. గాల్లోకి కాల్పులు జరిపే సమయంలో బిగ్లర్స్ విజిల్స్ ఊది సూచనలు చేస్తారు.
►ఇది పూర్తయిన తర్వాత తుపాకుల్ని తలకిందులుగా తిప్పి కుడి కాలుమీద పెట్టుకుంటారు. దీన్ని ‘శోక్ శస్త్ర్’గా పిలుస్తారు.
►సలామీ శస్త్ర్, శోక్ శస్త్ర్ సందర్భాల్లో శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేకంగా పోలీస్‌బ్యాండ్ వాయిస్తారు. పోలీసు బ్యాండ్‌కు శిక్షణ ఇచ్చే సమయంలోనే ఈ సందర్భంలో వాయించే ఫ్యూనరల్ ట్యూన్‌ను నేర్పిస్తారు.
►పోలీసు పరిభాషలో ‘కార్వాయ్’గా పిలిచే ప్రధాన తతంగం దాదాపు పది నిమిషాల పాటు సాగింది.
దాసరి సేవలు ఎనలేనివి
పంజగుట్ట: సినీరంగంలోనే కాక పత్రికా రంగానికి దాసరి నారాయణరావు చేసిన సేవలు ఎనలేనివని పలువురు సీనియర్ పాత్రికేయులు కొనియాడారు. బుధవారం ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆ«ధ్వర్యంలో దాసరి నారాయణరావు సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు రవికాంత్‌రెడ్డి మాట్లాడుతూ... మీడియా గుత్తాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఉదయం పత్రికను స్థాపించి ఎంతో మందికి అవకాశం కల్పించారన్నారు. తన పత్రికద్వారా ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన ఘనత దాసరికి దక్కుతుందన్నారు, జర్నలిస్టులకు అపారమైన స్వేచ్ఛ ఇచ్చారని, అటు సినీరంగంలో ఇటు పాత్రికేయ రంగంలోనూ ఎంతోమందికి ఉపాధి కల్పించిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సుబ్రమణ్యం, క్లబ్ వైస్ ప్రసిడెంట్ జనార్థన్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మెంబర్స్ రాజేష్, నరేందర్ పద్మశాలి పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
దాసరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నివాళి
లాలాపేట: తెలుగు సినీ దిగ్గజం దాసరి నారాయణరావుకు బుధవారం లాలాపేటలోని తెలుగు బుక్ ఆఫ్ రికారŠుడ్స ప్రధాన కార్యాలయంలో సంస్థ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు వెంకటాచారి మాట్లాడుతూ దాసరి నారాయణరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 151 సినిమాలకు దర్శకత్వం వహించి, ఎంతో మందికి సినీ జీవితాన్ని ప్రసాదించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో చెరుగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన 73వ జన్మదిన వేడుకల సందర్భంగా దాసరి పేరును తెలుగు బుక్ ఆఫ్ రికారŠుడ్సలో నమోదు చేసినట్లు గుర్తు చేశారు.