పరి‘మితి’మీరొద్దు
♦ ఎన్నికల వ్యయంపై నియంత్రణ
♦ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి
రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.5 లక్షలుగా నిర్ణయించినట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల వ్యయం, ప్రచారం, ఓటింగ్ శాతం పెంపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించా రు.
పరిమితికి మించి ఖర్చు చేసేవారిపై అనర్హత వేటు పడుతుందని కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 28 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, 24 మంది వ్యయ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వీడియో చిత్రీకరణ, అకౌంటింగ్, మీడియా మానిటరింగ్ టీమ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ప్రత్యేకంగా నియమించామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే వివిధ రకాల పరికరాలు, వస్తువులకు అద్దె ధరలు నిర్ధారించినట్టు చెప్పారు.
అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరచి...ఆ నంబర్‌ను నామినేషన్ పత్రంలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రచారంలో సెక్యూరిటీ పరంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడవచ్చునని, దానికి ఇంధన వ్యయం భరించాల్సి ఉంటుందని చెప్పారు.
ఓటింగ్ శాతంపై దృష్టి
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కమిషనర్ కోరారు. ఓటరు స్లిప్పులను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు.
జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్
ఎన్నిక ల్లో అక్రమాలు, మద్యం పంపిణీ, నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. వీటిపై 040-23261330, 2322018, 23221978 నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు, అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివనాయుడు, చీఫ్ అకౌంట్స్ ఎగ్జామినర్ నిరంజన్‌షా తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ... అనేక ప్రాంతాల్లో మిగతా పార్టీలకు అవకాశం లేకుండా అధికార టీఆర్‌ఎస్ అనుమతి పొందిన హోర్డింగులన్నింటినీ బుక్ చేసుకుందని కమిషనర్ దృష్టికి తెచ్చారు. మిగతా పార్టీలకు కొన్ని హోర్డింగులను ఇవ్వాలని కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేసిన వారికి అనుమతినిచ్చి ఫీజు తీసుకోవడం తప్ప తామేమీ చేయలేమన్నారు.
అభ్యర్థుల తరఫున ప్రచారానికి ప్రముఖ స్టార్లు వస్తే.. ఆ ఖర్చులను కూడా అభ్యర్థి లెక్కలో చూపాలన్నారు. రాష్ట్ర పార్టీల ఖర్చును అభ్యర్థుల ఖాతాలో పొందుపరచాలన్నారు. రిపబ్లిక్ డే రోజు జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండాలు ఎగురవే స్తే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నిరంజన్ (కాంగ్రెస్), డాక్టర్ సుధాకర్ (సీపీఐ) తదితరులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. గతంలో మంత్రి బాగారెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు పదవికి రాజీనామా చేశారని నిరంజన్ గుర్తుచేశారు.