
టార్గెట్ 100%
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ లక్ష్యంగా అధికారులు కార్యాచరణ ఫ్రారంభించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ లక్ష్యంగా అధికారులు కార్యాచరణ ఫ్రారంభించారు. ఈ మేరకు అన్ని వర్గాల సహకారం తీసుకుంటున్నారు. గ్రేటర్ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి సోమవారం జీహెచ్‌ఎంసీలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యుఏ), పౌర సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీకి 2009లో జరిగిన ఎన్నికల్లో 46 శాతం, 2002లో 28 శాతం పోలింగ్ మాత్ర మే నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి నూరుశాతం పోలింగ్ జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. దీనికి పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈనెల 26న రిపబ్లిక్‌డే సందర్భంగా అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు, కాలనీల్లో పోలింగ్‌లో పాల్గొనేలా ప్రతిజ్ఞలు చేయించాలని సూచించారు. నగరంలోని స్వయం సహాయక సంఘాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివకుమార్ నాయుడు, రామకృష్ణారావు, రవికిరణ్, శంకరయ్య, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబమంతా ఓటు వేసేలా...
తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులందరూ విధిగా ఓటు వేసేలా ఒప్పించే హామీ పత్రాన్ని విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్, ఎన్నికల అధికారి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు సాధ్యమైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా పెద్దలు ఓటింగ్‌లో పాల్గొనేలా పిల్లలతో చెప్పించనున్నట్టు తెలిపారు.
- సాక్షి, సిటీబ్యూరో