ఇన్‌చార్జి పదవా.. మాకొద్దు
► అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జీలు లేని దుస్థితి
► బాధ్యతలు తీసుకునేందుకు ముందుకురాని నేతలు
► గ్రేటర్‌లో సైతం అధ్యక్ష పదవి ఖాళీ
► దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ
సాక్షి ప్రతినిధి, వరంగల్ : దశాబ్దకాలం అధికారంలో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు నాయకులు దొరకని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం వరకు పార్టీ బాధ్యతల కోసం పోటీ పడిన నేతలు ఇప్పుడు బాధ్యతలు తీసుకోవాలంటే జంకుతున్నారు. ఫలితంగా ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో అంతా తామై వ్యవహరించిన నేతలు ఇప్పుడు జిల్లాలో కనిపించడం చాలా అరుదు. పదవులు అనుభవించి, ఆర్థికంగా స్థిరపడిన వారు కష్టకాలంలో పార్టీని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారుు. పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసే తరహాలో నియోజకవర్గ స్థాయి నేతలు లేకపోవడంతో అధికార పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కింది స్థాయి నేతలు స్పందించాలని చెబుతున్నా పెద్ద నాయకులు మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పార్టీలో నెలకొంది. నియోజకవర్గ ఇంచార్జిల నిర్లిప్త వైఖరితో పార్టీ పరంగా పూర్తిగా స్తబ్ధత నెలకొంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో పార్టీకి నష్టం చేకూరుస్తుందనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు నాయకత్వంలేని దుస్థితి నెలకొందనే చర్చ జరుగుతోంది. వాస్తవ పరిస్థితులు దీన్నే స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్య ఇటీవల గ్రేటర్ ఎన్నికలకు ముందు అధికార పార్టీలో చేరారు. పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సారయ్యతోపాటే టీఆర్‌ఎస్‌లోకి మారారు. సారయ్య కాంగ్రెస్‌ను వీడడంతో ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ లేకుండాపోయారు.
2014 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఒక్క డోర్నకల్ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మారిన పరిణామాలతో డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరారు. రెడ్యానాయక్ 2014 నవంబరులో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆ నియోజకర్గానికి కాంగ్రెస్ తరుపున నాయకత్వం లేని పరిస్థితి ఉంది.
మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాలోత్ కవిత సైతం ఆమె తండ్రి డి.ఎస్.రెడ్యానాయక్ బాటలోనే నడిచారు. 16 నెలల క్రితం అధికార పార్టీలోకి మారారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి ఇంచార్జి లేరు. కొత్తగా బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఎస్టీ కేటగి రీకి కేటాయించిన ఈ నియోజకవర్గం బాధ్యతను తాత్కాలికంగా ఇతరవర్గానికి చెందిననేతకు అప్పగించారు. దీం తో పార్టీ పరంగా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జి.విజయరామారావు పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనడం లేదు. రాష్ట్ర నేతలు పాల్గొనే సభలకు వచ్చి వెళ్లడంతో సరిపెడుతున్నారు. నియోజకవర్గ నేతలతో ఎలాంటి సంబంధాలూ కలిగి ఉండడం లేదు. దీంతో ఈ సెగ్మెంట్‌లోనూ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులే నెలకొన్నాయి.
గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ముందు నగరంలో కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ టీఆర్‌ఎస్‌లో చేరి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. గ్రేటర్ అధ్యక్షుడు పార్టీ మారడంతో ఎన్నికల సమయంలో పార్టీలో అయోమయం నెలకొంది. కాంగ్రెస్‌లో పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండేది. ఇప్పుడు మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై నగరంలోని నేతలు ఎవరూ ఆసక్తి చూపడంలేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.