వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్, సర్కిల్-11 అబ్జర్వర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్ అధికారులను ఆదేశించారు.
శేరిలింగంపల్లి : వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్, సర్కిల్-11 అబ్జర్వర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి సర్కిల్-11 కార్యాలయంలో గురువారం వర్షాల నేపథ్యంలో ఈ సీజన్‌లో తలెత్తే సమస్యలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం మ్యాన్‌హోల్స్‌పై మూతల ఏర్పాటు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే విధంగా వర్షపు నీరు డ్రెయిన్స్ ఉన్న ప్రాంతాల్లో వాటిపై కప్పులు ఉన్నాయా లేదా పరిశీలించి వాటిలో ఎవరు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బస్తీలు, కాలనీ మధ్య నుంచి నాలాల్లో పడకుండా ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు వాటిలో పూడికను కూడ తొలగించి వర్షపు నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు. జలమండలి విభాగం ఈ సీజన్‌లో పైప్‌లైన్‌ల ఏర్పాటు కోసం రోడ్లను కటింగ్ చేయవద్దన్నారు. ఏ పని చేపట్టినా ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ముందుకు సాగాలన్నారు.
దుర్గం చెరువు వర్షపు నీరుతో నిండితే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అదే విధంగా గాలివానల కారణంగా కూలే ఎలక్ట్రికల్ లైన్లకు మరమ్మతులు చేపట్టేందుకు ఆ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సీజన్‌లో వచ్చే సమస్యల పరిష్కారానికి అన్ని విభాగాల వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర టీంలతో పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ఆయా పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్బంగా ఏ ఏ విభాగం ఏ పనులు చేపట్టాలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ మోహన్‌రెడ్డి, ఏసీపీ కష్ణమోహన్, డీఈ రాజ్‌కుమార్, నాగరాజు, జలమండలి డీజీఎం రాజశేఖర్, ఇరిగేషన్ డీఈ యాదగిరి, గచ్చిబౌలి ఇన్స్‌పెక్టర్లు రమేష్, ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ నర్సింహులు, అర్బన్ బయోడైవర్సిటీ సర్కిల్-11 మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ జలంధర్‌రెడ్డి, రెమెన్యూ, ఐలా, ప్రాజెక్టు డివిజన్ అధికారులు పాల్గొన్నారు.