మళ్లీ నిర్మిస్తే జైలుకే | GHMC Starts Demolition Of Illegal Structures At Canals In City | Sakshi
Sakshi News home page

మళ్లీ నిర్మిస్తే జైలుకే

Published Wed, Sep 28 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

మళ్లీ నిర్మిస్తే జైలుకే

మళ్లీ నిర్మిస్తే జైలుకే

కూల్చివేసిన కట్టడాలను తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు
* మంగళవారం ఒక్కరోజే 204 నిర్మాణాల కూల్చివేత

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నాలాలపై కట్టడాలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. కూల్చిన వాటిని తిరిగి నిర్మిస్తే కేసులు పెట్టి జైలుకు పంపడానికి సైతం వెనుకాడవద్దని నిర్ణయించింది. అంతేగాకుండా కూల్చివేతల ఖర్చును సైతం వారి నుంచి వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ యాక్ట్‌లోని 669 సెక్షన్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.

అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఒత్తిళ్లకు తలొగ్గవద్దంటూ ముఖ్యమంత్రి కూడా ఆదేశించడంతో మంగళవారం మరింత ముమ్మరం చేశారు. నాలాలపై నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలతోపాటు శిథిలమైన భవనాలను కూల్చివేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 204 నిర్మాణాలను కూల్చివేశారు.
 
ఆగని అక్రమ నిర్మాణాలు...
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ(బీఆర్‌ఎస్) కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత కూడా భారీయెత్తున అక్రమ నిర్మాణాలు జరిగినట్లు జీహెచ్‌ఎంసీ దృష్టికి వచ్చిం ది. దీంతో అధికారులు గత జనవరిలో సర్వే జరిపించారు. గతేడాది అక్టోబర్ 28 నాటికి నిర్మాణమై ఉన్న వాటికి మాత్రమే బీఆర్‌ఎస్ వర్తిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా 583 అక్రమ నిర్మాణాలు జరిగాయి. వాటిలో దాదాపు 460 నిర్మాణాలను కూల్చివేశారు కూడా. అయితే ఆ తరువాత కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయి. దీంతో భవిష్యత్తులో ఎవరూ అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా ఉండేందుకుగాను జీహెచ్‌ఎంసీ యాక్ట్ 669ను ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

దీని ప్రకారం అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయడంతో పాటు నిర్మించుకుంటున్నవారిని అరెస్టు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపా రు. ఇప్పుడు కూల్చివేస్తున్న నిర్మాణాలను ఎవరైనా తిరిగి నిర్మిస్తే ఈ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కూల్చివేతల వ్యయాన్ని సైతం వారి నుంచే రాబడతామన్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులెవరైనా అక్రమాలను ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా అక్రమ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం కనబరిచే అధికారులు, సిబ్బందిని ఏకంగా సర్వీసు నుంచే తొలగిం చేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో త్వరలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుండడంతో కఠిన చర్యలకు అవకాశముంటుందని భావిస్తున్నారు.
 
వేగంగా కూల్చివేతలు...
నాలాలపై ఆక్రమణల తొలగింపునకు బెంగళూరు విధానాన్ని అనుసరిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు.. వేగంలో మాత్రం ఆ నగరాన్ని మించిపోయారు. బెంగళూరులో నాలాలపై 1,913 నిర్మాణాల్ని గుర్తించి నెలరోజుల్లో 200 నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్‌ఎంసీ ఒక్కరోజులోనే 204 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘ఇవాళ చేసింది గుడ్‌జాబ్.. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగండి..’ అని అధికారులకు మెసేజ్ పంపారు.
 
‘బడా’ అక్రమాలను వదిలేస్తున్నారు?
* రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బడాబాబుల జోలికి వెళ్లకుండా కేవలం నిరుపేదలకు చెందిన నిర్మాణాలనే కూలుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓల్డ్ కర్నూల్ రోడ్డుపై ఫంక్షన్‌హాళ్లను నిర్మించి వరద నీరు వెళ్లకుండా అడ్డుకున్న వారి నిర్మాణాలను వదిలేసి.. తమపై ప్రతాపం చూపుతున్నారని వాపోయారు.
* బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని అంతగానికుంట చెరువు (తాజ్‌బంజారా లేక్)ను ఆక్రమించి నాలా వెంబడి  600 గజాల స్థలంలో ప్రైవేట్ వ్యక్తి పార్కు నిర్మించుకున్నట్లు గుర్తించారు.
* కూకట్‌పల్లి సర్కిల్‌లోని హైదర్‌నగర్ బృందావన్ కాలనీలో ఇంటి నిర్మాణానికి మాత్రం అనుమతి పొంది మూడు షట్టర్లు వేశారు.వాటిని పూర్తిగా కూల్చకుండా తూతూమంత్రంగా సగం కూల్చి వెళ్లిపోయారు.
* బేగంపేట్ అల్లంతోట బావి ప్రాంతంలో నాలాను ఆక్రమించి వేసుకున్న దాదాపు 40 గుడిసెలను అధికారులు నేలమట్టం చేశారు. అధికార యంత్రాంగం భారీగా అక్కడికి చేరుకోవడంతో గుడిసెల్లో నివాసం ఉంటున్నవారు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు కూల్చివేశారు.
* సోమవారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ఆంజనేయనగర్‌లో చేపడుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపును మూసాపేట డివిజన్ కార్పొరేటర్ తూము శ్రవణ్‌కుమార్ నిలిపివేయగా వెళ్లిపోరుున అధికారులు.. మంగళవా రం అటువైపు రాకపోవడం గమనార్హం.
 
కోర్టుల్లో 6 వేల కేసులు
జీహెచ్‌ఎంసీలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి వివిధ కోర్టుల్లో ఉన్న కేసులపై జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సెల్స్‌తో మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమావేశమయ్యారు. మొత్తం గా దాదాపు 6 వేల కోర్టు కేసులు ఉన్నాయని వారు ఈ సందర్భంగా వివరించారు.
 
ఫిర్యాదులే ఫిర్యాదులు
అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసే వారికి సీఎం కేసీఆర్ రూ.10వేల నజరానా ప్రకటించడంతో జీహెచ్‌ఎంసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు రోజుల్లోనే 118 ఫిర్యాదులు వచ్చినా.. నజరానాకు సంబంధించి విధివిధానాల కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. ఒకే అక్రమ నిర్మాణం గురించి ఎక్కువ మంది తెలియజేస్తే బహుమతిని ఎవరికి ఇవ్వాలి, అందరికీ పంచి ఇవ్వాలా... బహుమతుల మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుందా, జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచి ఇవ్వాలా అన్న విషయాలపై స్పష్టత కోరనున్నారు. అయితే ఇప్పటికే గుర్తించిన అక్రమ నిర్మాణాలకు ఇది వర్తించదని.. కొత్తగా జరుగుతున్న నిర్మాణాలకు వర్తిస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ గుర్తించిన అక్రమ నిర్మాణాలేవో ప్రజలకు తెలియనందున ఆ వివరాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని అధికారులు యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement