జీహెచ్‌ఎంసీలో టెండర్ల గోల్‌మాల్ ? | Golmaal in ghmc tenders ? | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీలో టెండర్ల గోల్‌మాల్ ?

Published Tue, Apr 12 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

జీహెచ్‌ఎంసీలో  టెండర్ల గోల్‌మాల్ ?

జీహెచ్‌ఎంసీలో టెండర్ల గోల్‌మాల్ ?

కొత్త ఏజెన్సీలకు కాంట్రాక్టులివ్వని వైనం
పాత ఏజెన్సీల ఒత్తిళ్లే కారణం ..?

 

సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని అధికారులు, ఉద్యోగులపై అడపాదడపానైనా చర్యలు తీసుకుంటున్న అధికారులు ఏళ్ల తరబడి తిష్టవేసిన కాంట్రాక్టర్లను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. ఆయా పనుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు కింద సమకూర్చే ఏజెన్సీలది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఇందుకు తాజా నిదర్శనం...రవాణా విభాగానికి అవసరమైన డ్రైవర్లు, వర్కర్ల కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా ఖరారు కాకపోవడం. దాంతో పాత కాంట్రాక్టర్లే కొనసాగే పరిస్థితి నెలకొంది. గడువు ముగిసిన తర్వాత కొత్త వారిని తీసుకోకపోవడంతో  పాతవారినే కొనసాగిస్తున్నారు. ఇలా  జీహెచ్‌ఎంసీలో పాతుకుపోయిన కాంట్రాక్టు ఏజెన్సీలు...కార్పొరేషన్‌లో తాము తప్ప ఇతరులు రాకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నాయి.  జీహెచ్‌ఎంసీలో చెత్తను తరలించే వాహనాల డ్రైవర్లు, వర్కర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకునేందుకు గత నవంబర్ 6న టెండర్లు పిలిచారు. గత మార్చి నెలాఖరుకు కాంట్రాక్టు సంస్థల గడువు ముగిసిపోనుండటాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ ఆరంభం నుంచి కొత్త కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించేందుకు ఈ టెండర్లు పిలిచారు. వివిధ షిప్టుల్లో వాహనాలు నడిపేందుకు అవసరమైన 953 మంది డ్రైవర్లు, 1537 మంది వర్కర్ల కోసం మొత్తం 28 ప్యాకేజీలుగా ఈ టెండర్లు పిలిచారు.


జీహెచ్‌ఎంసీకి చెందిన మూడు పార్కింగ్ యార్డుల్లోని వాహనాలను నడిపేందుకు వీటిని పిలిచారు. తొలి గడువు ముగిసే సమయానికి 10 ప్యాకేజీలకు మాత్రమే టెండర్లు రావడంతో పొడిగింపునిచ్చారు. రెండో దఫా ఏడు ప్యాకేజీలకే టెండర్లు రావడంతో తిరిగి నవంబర్ 28న మరో దఫా టెండర్లు పిలిచారు. మొత్తానికి 28 ప్యాకేజీలకు టెండర్లు రావడంతో ఎల్1గా ఉన్నవారిని గుర్తించినప్పటికీ,  ఇంకా  వారికి  కాంట్రాక్టు ఇవ్వలేదు. పాత ఏజెన్సీల ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  ఐదారు ఏజెన్సీలు సిండికేట్‌గా కుమ్మక్కై తమకు తప్ప కొత్తవారెవరికీ టెండరు దక్కరాదనే తలంపుతో అధికారులపై ఒత్తిడి  తేవడంతో  ఈ వ్యవహారాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు తెలిసింది. పారిశుధ్య కార్మికుల తరహాలోనే ఉండాల్సినంత మంది డ్రైవర్లు, వర్కర్లను విధుల్లో ఉంచకుండానే  వారిపేరిట నెలనెలా వేతనాలను కాజేయడం అలవాటైన ఏజెన్సీలు ఇతరులు రాకుండా ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తవారికి కాంట్రాక్టులు ఇవ్వకపోవడంతో.. పాతవారినే కొనసాగిస్తున్నారు. ఇందుకుగాను రవాణా విభాగంలోని సంబంధిత అధికారులకు భారీ ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement