Parking yard
-
ఛాసీలు ఇలా.. బస్సులు మరెలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పెద్దసంఖ్యలో బస్సు ఛాసీలను కొనుగోలు చేసింది. అయితే నగరంలో ఉన్నవి చిన్న వర్క్‌షాప్‌లు కావడం, అందులో పనిచేసే కార్మికులు సొంతూళ్లకు వెళ్లడంతో కొత్త బస్సులకు బాడీలు కట్టేవారు కరువయ్యారు. దీంతో నెలల తరబడి ఆ ఛాసీలు పార్కింగ్ యార్డులో ఎదురుచూడాల్సి వస్తోంది. వర్షాలు కురుస్తుండటంతో ఆ ఛాసీల్లోంచి గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగ్గా, తీగజాతి మొక్కలు వాటిని అల్లుకుపోతున్నాయి. కొన్ని ఛాసీలైతే సరిగ్గా కనిపించనంతగా వాటిని చుట్టేశాయి. చాలా ఏళ్ల తర్వాత కొత్త బస్సులు ఆర్టీసీ చాలాఏళ్ల తర్వాత 1,200 కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ తరుణంలో ఇటీవల పెద్ద సంఖ్యలో బస్సుల ఛాసీలు ఆర్టీసీ పార్కింగ్ యార్డుకు చేరుకున్నాయి. గతంలో మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాప్‌లో సొంతంగా ఛాసీలకు బాడీలు నిర్మించుకునేది. ప్రస్తుతం ఆ వర్క్‌షాపు నీర సించిపోయింది. అక్కడ నెలకు 25 ఛాసీలకు మాత్రమే బాడీ లు నిర్మిస్తోంది. త్వరలో నెలకు 15 బస్సులకు బాడీలు నిర్మించేలా కొత్త లైను ఏర్పాటు చేస్తున్నారు. అయితే బాడీలు కట్టే పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఆర్టీసీ 34 ప్రైవేట్ వర్క్‌షాపులకు ఆర్డర్ ఇచ్చి0ది. కానీ వాటి సామర్థ్యం చాలా తక్కు వ. ఒక్కో వర్క్‌షాపు నెలకు మూడు నుంచి ఐదు ఛాసీలకు మాత్రమే బాడీలు నిర్మించేంత చిన్నవి. అందులోనూ ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు ఏడాదిలో రెండు మూడు పర్యాయాలు సెలవుల్లో వెళతారు. ఇటీవల వేసవి సెలవుల కోసం వెళ్లినవారు గత నెలలోనే తిరిగొచ్చారు. దీంతో రెండు నెలల పాటు వాటి ల్లో పనులు సరిగ్గా జరగలేదు. ఫలితంగా ఛాసీలన్నీ పేరుకుపోయాయి. వానాకాలం ముంచుకురావటంతో గడ్డిలో కూరుకుపోయాయి. ఇక ఏపీ ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రైవేట్ బ స్సులకు కూడా ఆ వర్క్‌షాపులే దిక్కవుతుండటంతో పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది. అయితే రెండుమూడు నెలలపాటు వానకు తడిసినా, గడ్డి మధ్య కూరుకుపోయినా ఛాసీలు పాడు కావని మరోవైపు అధికారులు చెబుతున్నారు. బడా కంపెనీలతో సంప్రదింపులు తాను కొంటున్న బస్సు ఛాసీలకు స్థానికంగానే బాడీ కట్టిస్తు న్న ఆర్టీసీ ఇకపై ముంబయి, జైపూర్లలో ఉన్న బడా కంపెనీలకు ఆర్డరివ్వాలని భావిస్తోంది. ఉత్తర, మధ్య భారత్ ప్రాంతాల్లోని బడా కంపెనీలకు తరలించి బాడీ నిర్మించి హైదరాబాద్‌కు తీసుకురావాలని అనుకుంటోంది. ఈ మేరకు ఆయా నగరాల్లో ఉన్న బడా బస్‌బాడీ నిర్మాణ కంపెనీలతో ఆర్టీసీ సంప్రదిస్తోంది. ఒక బస్సు ఛాసీకి బాడీ నిర్మించాలంటే రూ.11 లక్షల వరకు ఖర్చవుతుండగా, దూర ప్రాంతాల్లోని బడా కంపెనీలకు ఆర్డరిస్తే ఈ ఖర్చు మరికాస్త పెరిగే అవకాశముంది. అయితే వేగంగా బస్సు సిద్ధమై రోడ్డెక్కితే వెంటనే ఆదాయం పెరిగే వీలున్నందున, లాభమే ఉంటుందన్నది ఆర్టీసీ ఆలోచన. -
జీహెచ్ఎంసీలో టెండర్ల గోల్మాల్ ?
కొత్త ఏజెన్సీలకు కాంట్రాక్టులివ్వని వైనం పాత ఏజెన్సీల ఒత్తిళ్లే కారణం ..? సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని అధికారులు, ఉద్యోగులపై అడపాదడపానైనా చర్యలు తీసుకుంటున్న అధికారులు ఏళ్ల తరబడి తిష్టవేసిన కాంట్రాక్టర్లను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. ఆయా పనుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు కింద సమకూర్చే ఏజెన్సీలది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఇందుకు తాజా నిదర్శనం...రవాణా విభాగానికి అవసరమైన డ్రైవర్లు, వర్కర్ల కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా ఖరారు కాకపోవడం. దాంతో పాత కాంట్రాక్టర్లే కొనసాగే పరిస్థితి నెలకొంది. గడువు ముగిసిన తర్వాత కొత్త వారిని తీసుకోకపోవడంతో పాతవారినే కొనసాగిస్తున్నారు. ఇలా జీహెచ్ఎంసీలో పాతుకుపోయిన కాంట్రాక్టు ఏజెన్సీలు...కార్పొరేషన్లో తాము తప్ప ఇతరులు రాకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నాయి. జీహెచ్ఎంసీలో చెత్తను తరలించే వాహనాల డ్రైవర్లు, వర్కర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకునేందుకు గత నవంబర్ 6న టెండర్లు పిలిచారు. గత మార్చి నెలాఖరుకు కాంట్రాక్టు సంస్థల గడువు ముగిసిపోనుండటాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ ఆరంభం నుంచి కొత్త కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించేందుకు ఈ టెండర్లు పిలిచారు. వివిధ షిప్టుల్లో వాహనాలు నడిపేందుకు అవసరమైన 953 మంది డ్రైవర్లు, 1537 మంది వర్కర్ల కోసం మొత్తం 28 ప్యాకేజీలుగా ఈ టెండర్లు పిలిచారు. జీహెచ్ఎంసీకి చెందిన మూడు పార్కింగ్ యార్డుల్లోని వాహనాలను నడిపేందుకు వీటిని పిలిచారు. తొలి గడువు ముగిసే సమయానికి 10 ప్యాకేజీలకు మాత్రమే టెండర్లు రావడంతో పొడిగింపునిచ్చారు. రెండో దఫా ఏడు ప్యాకేజీలకే టెండర్లు రావడంతో తిరిగి నవంబర్ 28న మరో దఫా టెండర్లు పిలిచారు. మొత్తానికి 28 ప్యాకేజీలకు టెండర్లు రావడంతో ఎల్1గా ఉన్నవారిని గుర్తించినప్పటికీ, ఇంకా వారికి కాంట్రాక్టు ఇవ్వలేదు. పాత ఏజెన్సీల ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఐదారు ఏజెన్సీలు సిండికేట్‌గా కుమ్మక్కై తమకు తప్ప కొత్తవారెవరికీ టెండరు దక్కరాదనే తలంపుతో అధికారులపై ఒత్తిడి తేవడంతో ఈ వ్యవహారాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు తెలిసింది. పారిశుధ్య కార్మికుల తరహాలోనే ఉండాల్సినంత మంది డ్రైవర్లు, వర్కర్లను విధుల్లో ఉంచకుండానే వారిపేరిట నెలనెలా వేతనాలను కాజేయడం అలవాటైన ఏజెన్సీలు ఇతరులు రాకుండా ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తవారికి కాంట్రాక్టులు ఇవ్వకపోవడంతో.. పాతవారినే కొనసాగిస్తున్నారు. ఇందుకుగాను రవాణా విభాగంలోని సంబంధిత అధికారులకు భారీ ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి.