ఆర్టీసీ పార్కింగ్ యార్డులో నెలలుగా మగ్గుతున్న కొత్త బస్సుల ఛాసీలు
వాటి మధ్యలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు
34 ప్రైవేట్ వర్క్‌షాపులకు బాడీలు కట్టే ఆర్డర్
సొంతూళ్లకు వెళ్లిన ఒడిశా, యూపీ కార్మికులు..పనుల్లో తీవ్ర జాప్యం
ముంబై, జైపూర్‌లోని బడా వర్క్‌షాపులకు ఆర్డర్ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పెద్దసంఖ్యలో బస్సు ఛాసీలను కొనుగోలు చేసింది. అయితే నగరంలో ఉన్నవి చిన్న వర్క్‌షాప్‌లు కావడం, అందులో పనిచేసే కార్మికులు సొంతూళ్లకు వెళ్లడంతో కొత్త బస్సులకు బాడీలు కట్టేవారు కరువయ్యారు. దీంతో నెలల తరబడి ఆ ఛాసీలు పార్కింగ్ యార్డులో ఎదురుచూడాల్సి వస్తోంది. వర్షాలు కురుస్తుండటంతో ఆ ఛాసీల్లోంచి గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగ్గా, తీగజాతి మొక్కలు వాటిని అల్లుకుపోతున్నాయి. కొన్ని ఛాసీలైతే సరిగ్గా కనిపించనంతగా వాటిని చుట్టేశాయి.
చాలా ఏళ్ల తర్వాత కొత్త బస్సులు
ఆర్టీసీ చాలాఏళ్ల తర్వాత 1,200 కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ తరుణంలో ఇటీవల పెద్ద సంఖ్యలో బస్సుల ఛాసీలు ఆర్టీసీ పార్కింగ్ యార్డుకు చేరుకున్నాయి. గతంలో మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాప్‌లో సొంతంగా ఛాసీలకు బాడీలు నిర్మించుకునేది. ప్రస్తుతం ఆ వర్క్‌షాపు నీర సించిపోయింది. అక్కడ నెలకు 25 ఛాసీలకు మాత్రమే బాడీ లు నిర్మిస్తోంది. త్వరలో నెలకు 15 బస్సులకు బాడీలు నిర్మించేలా కొత్త లైను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే బాడీలు కట్టే పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఆర్టీసీ 34 ప్రైవేట్ వర్క్‌షాపులకు ఆర్డర్ ఇచ్చి0ది. కానీ వాటి సామర్థ్యం చాలా తక్కు వ. ఒక్కో వర్క్‌షాపు నెలకు మూడు నుంచి ఐదు ఛాసీలకు మాత్రమే బాడీలు నిర్మించేంత చిన్నవి. అందులోనూ ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు ఏడాదిలో రెండు మూడు పర్యాయాలు సెలవుల్లో వెళతారు. ఇటీవల వేసవి సెలవుల కోసం వెళ్లినవారు గత నెలలోనే తిరిగొచ్చారు.
దీంతో రెండు నెలల పాటు వాటి ల్లో పనులు సరిగ్గా జరగలేదు. ఫలితంగా ఛాసీలన్నీ పేరుకుపోయాయి. వానాకాలం ముంచుకురావటంతో గడ్డిలో కూరుకుపోయాయి. ఇక ఏపీ ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రైవేట్ బ స్సులకు కూడా ఆ వర్క్‌షాపులే దిక్కవుతుండటంతో పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది. అయితే రెండుమూడు నెలలపాటు వానకు తడిసినా, గడ్డి మధ్య కూరుకుపోయినా ఛాసీలు పాడు కావని మరోవైపు అధికారులు చెబుతున్నారు.
బడా కంపెనీలతో సంప్రదింపులు
తాను కొంటున్న బస్సు ఛాసీలకు స్థానికంగానే బాడీ కట్టిస్తు న్న ఆర్టీసీ ఇకపై ముంబయి, జైపూర్‌లలో ఉన్న బడా కంపెనీలకు ఆర్డరివ్వాలని భావిస్తోంది. ఉత్తర, మధ్య భారత్ ప్రాంతాల్లోని బడా కంపెనీలకు తరలించి బాడీ నిర్మించి హైదరాబాద్‌కు తీసుకురావాలని అనుకుంటోంది. ఈ మేరకు ఆయా నగరాల్లో ఉన్న బడా బస్‌బాడీ నిర్మాణ కంపెనీలతో ఆర్టీసీ సంప్రదిస్తోంది.
ఒక బస్సు ఛాసీకి బాడీ నిర్మించాలంటే రూ.11 లక్షల వరకు ఖర్చవుతుండగా, దూర ప్రాంతాల్లోని బడా కంపెనీలకు ఆర్డరిస్తే ఈ ఖర్చు మరికాస్త పెరిగే అవకాశముంది. అయితే వేగంగా బస్సు సిద్ధమై రోడ్డెక్కితే వెంటనే ఆదాయం పెరిగే వీలున్నందున, లాభమే ఉంటుందన్నది ఆర్టీసీ ఆలోచన.
Comments
Please login to add a commentAdd a comment