డీజీఎఫ్‌టీకి లేఖ రాయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్మగ్లర్లపై దాడులు చేసి అటవీశాఖ స్వాధీనం చేసుకున్న 8,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించాలని డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ)కి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అటవీశాఖ గిడ్డంగుల్లో మగ్గుతున్న ఎర్ర చందనాన్ని ఎగుమతి చేసేందుకు డీజీఎఫ్‌టీ ఇచ్చిన 75 రోజుల గడువు ముగియడంతో... పొడిగింపు కోరనున్నారు. అయితే, ఎర్ర చందనం ఎగుమతికి డీజీఎఫ్‌టీ అనుమతి నేపథ్యంలో.. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి మార్గదర్శకాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా... ఆ కమిటీ విధి విధానాలు సూచిస్తూ నివేదిక కూడా ఇచ్చింది. దీనికి ప్రభుత్వ అనుమతి రాక ముందే డీజీఎఫ్‌టీ ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను ఆమోదించిన తర్వాత... గడువు పెంపుకోసం మళ్లీ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర అటవీశాఖ అధికారులు నిర్ణయించారు.
ఎగుమతికి అవరోధమేమీ లేదు...
ఎర్రచందనం ఎగుమతికి వ్యతిరేకంగా తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలైన రిట్ పిటిషన్ల వల్ల ఏమైనా అవరోధం ఏర్పడుతుందా? అనే ప్రశ్నకు ఇప్పటివరకూ కోర్టులపరంగా ఎలాంటి అడ్డంకి లేదని రాష్ట్ర అటవీ దళాల అధిపతి బి.సోమశేఖరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ‘‘ఎర్ర చందనం ఎగుమతిని అడ్డుకుంటే వారి అక్రమ రవాణా సరుకుకు ధర ఎక్కువ వస్తుందనే స్వార్థంతో కొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన విషయం వాస్తవమే. ఆ కేసులను స్మగ్లర్లే వేయించారనే అనుమానాలు ఉన్నాయి. ఎర్ర చందనం ఎగుమతిని నిలిపివేయాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను పరిశీలించిన కోర్టులు స్టే ఇవ్వలేదు. అందువల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని ఎగుమతి చేసేందుకు ఎలాంటి సమస్య ఉండదు’’ అని ఆయన వివరించారు.
ప్రభుత్వానికి భారీ రాబడి..
గిడ్డంగుల్లోని ఎర్ర చందనం విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. వందల కోట్ల ఆదాయం సమకూరనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యమైన (ఏ-గ్రేడ్) ఎర్ర చందనం ధర టన్నుకు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన 8,500 టన్నులకు సుమారు రూ.1,500 కోట్లు వచ్చే అవకాశముంది. అయితే అటవీశాఖ విక్రయించనున్న దుంగలు ఏళ్ల తరబడి ఎండకు ఎండి, వానకు తడవడం వల్ల నాణ్యత దెబ్బతిన్నది. దానివల్ల రూ. 750 కోట్ల వరకూ ఆదాయం రావచ్చని అధికారుల అంచనా.
ఎర్రచందనం ఎగుమతికి గడువు కోరనున్న రాష్ట్రం
Published Sat, Mar 1 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement