మృతులను స్వగ్రామాలకు తరలిస్తాం
సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారిని స్వగ్రామాలకు తరలించడానికి ప్రభుత్వమే వాహనాలను సమకూర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేదలు ఏదైనా కారణం వల్ల చనిపోతే మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం వారికి ఆర్థికంగా భారమవుతోంది. ఈ పరిస్థితిని నివారించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకోసం ముందుగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఈ ఉచిత సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నారు.
ఆ తర్వాత జిల్లా ఆసుపత్రుల నుంచి కూడా గ్రామాలకు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచి చనిపోయిన వారిని ప్రభుత్వ ఖర్చుతోనే స్వగ్రామాలకు తరలిస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. తమిళనాడులో ఇటీవల పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బృందం ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది.