జూన్ 27కల్లా తరలిరావాల్సిందే
- హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం
- వెలగపూడిలో సచివాలయం, మంత్రులు, కార్యదర్శుల ఆఫీస్‌లు
- విజయవాడ, గుంటూరులో హెచ్‌వోడీల కార్యాలయాలు
- వారంలో ఆఫీస్‌లు వెతుక్కోవాలని శాఖలకు సీఎం సూచన
- ఒకే దశలోనే ఉద్యోగుల తరలింపు పూర్తి చేయాలని నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులందరినీ దశలవారీగా కాకుండా జూన్ 27వ తేదీ కల్లా నూతన రాజధానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అనుకున్నట్లు మూడు దశల్లో కాకుండా మొదటి దశలోనే అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి సిద్ధమైంది. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో కేవలం కార్యదర్శులు, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయాలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ శాఖల విభాగాధిపతుల కార్యాలయాలను వెలగపూడిలో కాకుండా విజయవాడ, గుంటూరు నగరాల్లో జూన్ 27కల్లా ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల తరలింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం తన క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఈ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.
ఆ కార్యాలయాల్లో పాత ఫర్నీచరే
వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి మూడు దశల్లో ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం మొన్నటివరకూ భావించింది. దీనిపై ఉద్యోగులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఉన్నట్టుండి నిర్ణయాన్ని మార్చుకుంది. వివిధ దశల్లో ఉద్యోగులను తరలిస్తే విద్యాసంవత్సరం మధ్యలో వారి పిల్లలకు ఇక్కడ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు దొరకవని ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో జూన్ 27 కల్లా మొదటి దశలోనే అందరినీ ఒకేసారి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కానీ, అప్పటికి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలను మాత్రమే జూన్ 27కల్లా వెలగపూడికి తరలించనుంది. విభాగాధిపతుల (హెచ్‌ఓడీలు) కార్యాలయాలను విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేయనుంది. గతంలో విజయవాడలో ఇరిగేషన్ శాఖకు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణాన్ని సిద్ధం చేశారు. గుంటూరులో వ్యవసాయ శాఖకు 40 వేల చదరపు అడుగులు, మున్సిపల్ శాఖకు 30 వేల చదరపు అడుగుల స్థలాన్ని చూశారు. మిగిలిన శాఖలూ తమకు అవసరమైన కార్యాలయాలను గతంలోనే చూసుకున్నాయి. ఇప్పుడు ఆ కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయాల్లో హైదరాబాద్‌లోని సచివాలయం, ఇతర కార్యాలయాల్లో ఉన్న ఫర్నిచర్‌ను వినియోగించాలని, వెలగపూడిలో మాత్రం కొత్త ఫర్నిచర్‌ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అంతస్తుల నిర్మాణం తాత్కాలికంగా వాయిదా
వెలగపూడికి సగం మందినే తరలించనుండడంతో ఆరు భవనాలపై రెండు, మూడు అంతస్తుల నిర్మాణాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి శనివారం టెండర్ల ఖరారును వాయిదా వేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలకు మొత్తం 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమవుతుందని అంచనా వేయగా ప్రస్తుతం వెలగపూడిలోని జీ+1 భవనాల్లో అసెంబ్లీ భవనాన్ని మినహాయించగా మిగిలిన ఐదు భవనాల్లో ఐదు లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికిగానూ ఇప్పటికే మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కార్యాలయాలను ఆయా శాఖలు గతంలోనే గుర్తించాయి.
ఇంకా నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలను వారంలోగా చూసుకోవాలని ఆయా శాఖలకు ముఖ్యమంత్రి సూచించారు. కృష్ణా జిల్లాలోనే ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నట్లు ఆ జిల్లా కలెక్టర్ చెప్పడంతో ఆ భవనాలను పరిశీలించాలని నిర్ణయించారు. తగిన ఏర్పాట్లు, వసతులు లేకపోవడంతో రాజధానికి రావడానికి ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 27కల్లా అందరినీ ఒకేసారి తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. మరోవైపు రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం సీఆర్‌డీఏ సలహా కమిటీ, సింగపూర్ ప్రతినిధులు శనివారం క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపారు. మరో రెండురోజులపాటు ఈ చర్చలు జరగనున్నాయి.