మంచో, చెడో విభజన జరిగిపోయింది : నరసింహన్
హైదరాబాద్ : నిత్యం ఆనందంగా ఉండటమే నా ఆరోగ్య రహాస్యం అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. బుధవారం రాజభవన్లో గవర్నర్ నరసింహన్ జన్మదిన వేడుకులు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నరసింహన్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ విషయాన్ని అయినా మనసులోకి తీసుకోనని అన్నారు. పని ఒత్తిడి ఎంత ఉన్న శరీరంపై పడకుండా చూసుకుంటానని చెప్పారు. నిజాయితీ, చిత్తశుద్ధితో గవర్నర్గా విధులు కొనసాగిస్తున్నానని తెలిపారు. మంచో, చెడో కాని రాష్ట్ర విభజన జరిగిపోయింది... ఈ విభజనను అందరూ అంగీకరించాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఎవరైనా ఆగ్రహంతో నాపై విమర్శులు చేస్తే వాటిని పట్టించుకోనన్నారు. అయితే హైదరాబాద్లో ఓటర్ల తొలగింపు తన పరిధిలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని తెలిపారు. అలాగే యూనివర్శిటీల వీసీల నియామకం సజావుగా జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.