గ్రూపు-2 పరీక్ష వాయిదా..
► అదనపు పోస్టులు వచ్చాకే..
► అధికారికంగా వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూపు-2 పోస్టుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన గ్రూపు-2 పరీక్షను టీఎస్‌పీఎస్సీ అధికారికంగా వాయిదా వేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 439 గ్రూపు-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. వాటికి మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోస్టులు తక్కువగా ఉండటం, అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో వాటి సంఖ్యను పెంచాలన్న డిమాండ్ పెరిగింది. అభ్యర్థులు ఆందోళనలు కూడా చేశారు. మరోవైపు పలువురు అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ముందుగా ఇచ్చిన 439 పోస్టులకు అదనంగా మరో 1000 పోస్టులను ఇస్తామని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ప్రకటించారు. దీనిపై టీఎస్‌పీఎస్సీకి అధికారిక సమాచారం రావడంతో, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.