
కాంగ్రెస్‌లో గ్రూపుల గొడవ!
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. పరస్పర విమర్శలతో నేతలు బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగారు
దానం వర్సెస్ మర్రి
పనిలోపనిగా పొన్నాలనూ విమర్శించిన దానం
ఫోన్లో అందుబాటులో లేరని మర్రి వివరణ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. పరస్పర విమర్శలతో నేతలు బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగారు. హైదరాబాద్‌లో గురువారం ఛాతీ ఆస్పత్రి సందర్శన, పేదలకు ఇళ్ల సమస్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు కార్యక్రమం రూపొం దించారు. అయితే ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ గైర్హాజరయ్యారు. దానం నాగేందర్‌ను పిలవడానికి ప్రయత్నించినా దొరకలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తనను పిలవకుండానే కార్యక్రమాలు చేపట్టారని దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి శశిధర్‌రెడ్డినే కాకుండా పనిలో పనిగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపైనా దానం నాగేందర్ విమర్శలు చేశారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లోకి దానం వెళ్తున్నారని కొందరు, టీడీపీలో చేరుతున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలతో కలిసి రాకపోవడాన్ని విలేకరులు ప్రశ్నించారు. దీనితో కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. దానం అందుబాటులోకి రాలేదని కాంగ్రెస్‌నేతలు అంటుండగా, తనను నిర్లక్ష్యం చేశారని పొన్నాల, మర్రిపై దానం నాగేందర్ నిప్పులు చెరిగారు.
ఫోన్ చేస్తే దొరకలేదు: మర్రి
ప్రభుత్వం చేస్తున్న తప్పులపై గవర్నరుకు ఫిర్యాదు చేయడానికి రావాలని దానం నాగేందర్‌కు ఫోన్లు చేశామని, ఫోనులో ఆయన అందుబాటులోకి రాలేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. దీంతో అందుబాటులో ఉన్న గ్రేటర్ కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లామన్నారు. దానం పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రస్తావించగా.. ‘కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉంటారు. పోయేవాళ్లు పోతారు. ఎవరు పోతున్నారో నాకైతే సమాచారం లేదు’ అని శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మర్రి ఎక్కడున్నా విపత్తే : దానం
మర్రి శశిధర్ రెడ్డి ఎక్కడ ఉన్నా విపత్తులాంటి వారేనని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన మర్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ తనకు తానే పెద్దనాయకుడ్ని అనే భ్రమల్లో ఉంటాడన్నారు. పార్టీ అభివృద్ధికోసం ఏమీ చేయలేదన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి ఎక్కడున్నా అక్కడ విపత్తేనని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఆయన ఎక్కడున్నాడో తెలియదన్నారు. సనత్‌నగర్‌లో ఉప ఎన్నికలు వస్తాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నాడని దానం విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇన్‌స్టంట్ కాఫీలాంటివారని విమర్శించారు. గ్రేటర్ అధ్యక్షునికి చెప్పకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవడం సరైందికాదన్నారు. పార్టీలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా పొన్నాల పనిచేస్తున్నాడని దానం విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా కొనసాగిస్తే కొనసాగించండి, లేకుంటే లేదన్నారు. పార్టీ పదవులు ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని దానం స్పష్టం చేశారు. తాను అందుబాటులో లేనని చెప్పడం సరికాదన్నారు.