ఘటనా స్థలంలో పడి ఉన్న బుల్లెట్
కాల్పులు జరిపి తండ్రీకొడుకుల నుంచి రూ. 3.49 లక్షల దోపిడీ పాతబస్తీలో కలకలం
భయపెట్టడానికి రోడ్డుపైకి రెండు రౌండ్ల కాల్పులు..
బ్యాంక్ నుంచి డబ్బులు తెస్తుండగా అడ్డగించిన దుండగులు
వారంలో రెండో ఘటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కేబీఆర్ పార్క్ వద్ద ఇటీవల జరిగిన ఘటనను మరువక ముందే పాతబస్తీలో కొందరు దుండగులు బుధవారం కాల్పులకు తెగబడ్డారు. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని వెళుతున్న రైల్వే ఉద్యోగిపై పట్టపగలే కాల్పులు జరిపి రూ. 3.49 లక్షలు దోచుకెళ్లారు. కంచన్‌బాగ్ అరుంధతీనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి బాలరాజు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమారుడు రాజ్‌కుమార్ చాంద్రాయణగుట్టలోని మ్యాక్స్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బాలరాజు ఇటీవల ఓ స్థలాన్ని కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం దాని రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డబ్బును తెచ్చేందుకు కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ వద్ద గల ఎస్‌బీఐ శాఖకు బాలరాజు వెళ్లారు. తన ఖాతా నుంచి రూ. 3.49 లక్షలు డ్రా చేసుకుని బ్యాగ్‌లో పెట్టుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కొడుకు రాజ్‌కుమార్ బైక్‌పై ఇంటికి వస్తుండగా.. రక్షాపురం కాలనీలోని భూమాత ఆలయం వద్దకు రాగానే ఎదురుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు వీరిని అడ్డగించారు. తమ వద్ద ఉన్న తపంచాను తీసి డబ్బు సంచిని ఇవ్వాలని బెదిరించారు. అయితే వారి బెదిరింపులకు లొంగని బాలరాజు బ్యాగ్‌ను గట్టిగా పట్టుకున్నారు. దీంతో దుండగులు తపంచాతో రోడ్డుపైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ వెంటనే బ్యాగును లాక్కొని పారిపోయారు. బాధితులు నేరుగా సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న డీసీపీ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీ మహ్మద్ అశ్వాక్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెనువెంటనే నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లు, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేసి రహదారులపై సోదాలు నిర్వహించారు.
నిందితుల కోసం గాలింపు..
కాల్పులకు పాల్పడిన నిందితులు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐదు నెలల క్రితం మెహదీపట్నంలో సూపర్‌మార్కెట్ వద్ద దుండగులు ఇలాగే బైక్‌పై వచ్చి సేల్స్‌మెన్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన హుమాయున్‌నగర్ పోలీసులు పక్షం రోజుల్లోనే అరెస్టు చేశారు. అయితే వాళ్లు బెయిల్‌పై జైలు నుంచి బయటికి రావడంతో వారిపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ గత ఆదివారం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు యజమాని దినేష్ సోనీని తుపాకీతో బెదిరించి రూ. 4.50 లక్షల విలువైన వజ్రాలు, నగలు దోచుకె ళ్లారు. సౌత్‌జోన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ఇదే తరహాలో జరిగిన తాజా ఘటనలో నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.