
వారి పోరాటాలు ఉనికి కోసమే!
♦ ప్రతిపక్షాలపై హరీశ్‌రావు మండిపాటు
♦ కరువు పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం
♦ రబీలో 9 గంటల విద్యుత్
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఊరందరిదీ ఒకదారి.. ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుగా ఉందని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎప్పుడు ఏం చేయాలో తెలియదని.. సమయం, సందర్భం, సమస్య లేకుండా జనంలోకి వెళ్లి రెచ్చగొట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు భూములివ్వకుండా రెచ్చగొడుతున్నాయని, కోర్టు కేసుల ద్వారా ప్రాజెక్టులకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
రబీ సాగుపై రైతులు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులలో మంత్రి హరీశ్‌రావు సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలది ఉనికి కోసమే పోరాటం తప్ప ప్రజల కోసం ఆరాటం కాదని విమర్శించారు.
అదనంగా విద్యుత్ సరఫరా...
పదేళ్ల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో రబీలో వ్యవసాయ విద్యుత్ వినియోగం రెండింతలు అవుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోందని.. పది వేల మెగావాట్లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే అదనంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యవహారాన్ని పెంచి పోషించిన ఘనత గత ప్రభుత్వాలకే దక్కుతుందని ఆరోపించారు.
నకిలీ విత్తనాల విషయంలో ఇప్పటికే 90 మంది డీలర్లపై కేసులు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్టు చేశారని తెలిపారు. నకిలీ విత్తన సరఫరాదారులపై అవసరమైతే పీడీ యాక్టు కింద కేసుల నమోదుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. గతంలో చేపపిల్లల పంపిణీకి నామమాత్రంగా రూ.5 లక్షలు కేటారుుంచగా.. ఈ ఏడాది జిల్లాకు రూ.4 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు హరీశ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, బాబూమోహన్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.