సాక్షి, హైదరాబాద్: కందుల సేకరణ, రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కందుల కొనుగోళ్లలో ఉదాసీనతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కందుల కొనుగోలు సమస్యపై మంగళవారం సమీక్షించిన మంత్రులు.. కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు రాసిన లేఖలపై స్పందన లేకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
75 వేల మెట్రిక్ టన్నుల సేకరణకే కేంద్రం అంగీకరించడంపై నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మార్చుకోవాలని, రైతుల ప్రయోజనాలు రక్షించేందుకు పునరాలోచించాలని కోరారు. రాష్ట్రంలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినా మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. కందుల కొనుగోలుపై ఈ నెల 15న ఢిల్లీలో మరోసారి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని హరీశ్ తెలిపారు. కంది రైతుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ. 600 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చినందుకు సీఎం కేసీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కంది రైతుల బకాయిలు త్వరగా చెల్లించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో కందుల దిగుబడి అనూహ్యంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డి దోవన దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్త తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు.
10 క్వింటాళ్ళకు పైగా తీసుకొస్తే నిఘా..
మార్క్‌ఫెడ్, హాకా ఏజెన్సీల అధికారులు రోజూ సాయంత్రానికి కందుల క్రయవిక్రయా లు సమీక్షించాలని.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద దీర్ఘకాలం పనిచేసే సిబ్బందిని తరచూ ఇతర కొనుగోలు కేంద్రాలకు మార్చా లని సూచించారు. నారాయణఖేడ్, నల్లగొం డ, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో రైతుల ముసుగులో కందుల అమ్మకాలు జరిపిన వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు హరీశ్ తెలిపారు. వారు తీసుకొచ్చిన కందులనూ జప్తు చేసినట్లు వెల్లడించారు.
రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. ఇకపై స్థానిక వ్యవసా య అధికారులు నిర్ధారించి ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతే సరుకులు కొనుగోలు చేయాలన్నారు. వారికి డబ్బులిచ్చే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 10 క్వింటాళ్ళకు పైగా కందులను మార్కెట్‌కు తీసుకొచ్చే వారిపై నిఘా పెట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి, మార్క్ ఫెడ్, హాకా, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
సాగుకు ముందే కంపెనీలతో ఒప్పందం
ధర కొనుగోలుపై పంట సాగుకు ముందే కంపెనీలు, రైతులు ఒప్పందం కుదుర్చునేలా వచ్చే ఏడాది నుంచి నిబంధన తీసుకొస్తామని మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎర్రజొన్నల ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నిజామాబాద్ ఎంపీ, ఆ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని.. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని మంత్రులు చెప్పారు. ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని, ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎర్రజొన్నలను కంపెనీలు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయని.. గతంలో విత్తక ముందే కొనుగోలు ఒప్పందం ఉండేదని, కొన్నేళ్లుగా రైతులు తమకు నచ్చిన కంపెనీలకు విక్రయిస్తున్నారన్నారు. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నందున కంపెనీలు కావాలని ధర తగ్గించాయన్నారు. పశుగ్రాసం కోసం వినియోగించే ఎర్రజొన్నలకు కేంద్రం మద్దతు ధర వర్తించదని చెప్పారు. కొన్ని ప్రాంతాలలో ఎర్రజొన్నల రైతులను కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 2008లో కొనుగోలు చేసిన ఎర్రజొన్నల డబ్బులను 2014 వరకు కూడా చెల్లించని చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment