టీడీపీ, సీపీఎం కుట్రల వల్లే..
- మల్లన్నసాగర్ ఘటనపై మంత్రి హరీశ్ ఫైర్
- ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే అడ్డుకుంటున్నారు
- బయట నుంచి వచ్చినవారే పోలీసులు, రైతులపై రాళ్లు రువ్వారు
- వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం
- ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాల బంద్ విఫలమైంది
సాక్షి, హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడానికి టీడీపీ, సీపీఎంల కుట్రలే కారణమని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు సాగునీరందితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. సోమవారమిక్కడ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో హరీశ్ మాట్లాడారు. సంగారెడ్డి, హైదరాబాద్ తదితర బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే రైతులను రెచ్చగొట్టారని, పోలీసులపై, రైతులపై రాళ్లు రువ్వారని అన్నారు.
హింసాత్మక ఘటనలను చోటు చేసుకోవడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సోమవారం తలపెట్టిన బంద్ విఫలమైందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని విపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతున్నాయని మండిపడ్డారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది గ్రామాలకుగాను ఆరు గ్రామాల రైతులు భూములివ్వడానికి అంగీకరించారని వెల్లడించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ప్రతిపక్షాలు ఇటీవల ఏ టెంట్ కింద దీక్షలు చేశాయో, అదే టెంట్ కింద రైతులు భూములిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వివరించారు. మిగిలిన రెండు గ్రామాల్లో కూడా ఒకట్రెండు రోజుల్లో భూసేకరణ సమస్య పరిష్కారమైతే తమ పని అయిపోయినట్లేనని భావించిన టీడీపీ, సీపీఎం నేతలు రాజీవ్ రహదారిపై హింసాత్మక ఘటలకు కుట్రపన్నారన్నారు.
‘‘అధికారులెవరూ ముంపు గ్రామాలకు వెళ్లి భూములివ్వాలని రైతులను అడగడం లేదు. రైతులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు. 2013 భూసేకరణ చట్టం లేదా 123 జీవోలలో ఏది కావాలనుకుంటే దాని ప్రకారం ప్రకారం భూసేకరణ జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాక ఇక సమస్య ఎక్కడిది? ప్రభుత్వ సంకల్పానికి సహకరించడానికి బదులు ప్రతిపక్షాలు ప్రాజెక్టులే కట్టకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.
ఖమ్మంను ముంచుతున్నారు
‘‘ఇన్ని రిజర్వాయర్లు అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారు. అది వారి అవివేకానికి నిదర్శనం. నదులు లేకున్నా ఆంధ్రా ప్రాంతంలో వెలిగొండ, అవుకు తదితర రిజర్వాయర్లు ఎందుకు నిర్మించారో చెప్పాలి. కృష్ణా డెల్టాలో మూడో పంట కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూ ఖమ్మం జిల్లాలో 8 వందల గ్రామాలను ముంచుతున్నారు. నల్లగొండ జిల్లాలో వందలాది ఎకరాలను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టారు. తెలంగాణలో కనీసం రెండు పంటలు పండించుకునే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మించడం తప్పా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గోదావరి నదిలో ఇప్పటికే 750 టీఎంసీల నీరు సముద్రం పాలైందని వివరించారు. గోదావరిలో నీళ్లు వచ్చినప్పుడే నిల్వ చేసుకుంటేనే పుష్కలంగా సాగునీరు అందించవచ్చని, అందుకే రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించారని చెప్పారు.
ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆ జిల్లాకే చెందిన నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే ధోరణులను తిప్పికొట్టాలన్నారు. పోలీసులు సంయమనం పాటించాలని ఆదేశించామని, విపక్షాలు కూడా సంయమనం పాటించాలన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టకుంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.