
గూడ అంజయ్యకు హరీశ్ పరామర్శ
రూ.లక్ష ఆర్థిక సహాయం
హైదరాబాద్: కొంతకాలంగా గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్న పాటల రచయిత, గాయకుడు గూడ అంజయ్యను రాంనగర్‌లోని ఆయన నివాసంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలసి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
బీఫార్మసీ చదువుతున్న కూతురు మమతను ఉన్నత చదువులు చదివిస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని,ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. గూడ అంజన్న అంటే గుండె నిండా తెలంగాణను నింపుకున్న వ్యక్తి అని, ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని హరీశ్‌రావు మీడియా మాట్లాడుతూ కొనియాడారు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: అంజయ్య
తనను గుర్తు పెట్టుకొని పరామర్శించడానికి రావడమేకాకుండా, ఆర్థిక సహా యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అంజయ్య పేర్కొన్నారు. ఒకానొక దశలో అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంశం మీద ప్రస్తుతం పాటల రూపంలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని, ఇప్పుడు పాడుతాననే ధైర్యం వచ్చిందని చెప్పారు.