ఎర్రచందనం స్మగ్లర్లకు ఇక కఠిన శిక్షలు పడనున్నాయి. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లభించింది.
- నాన్‌బెయిలబుల్ కేసులు
- స్మగ్లర్ల ఆస్తుల జప్తు
- అటవీ సవరణ చట్టం - 2016 నేటి నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లకు ఇక కఠిన శిక్షలు పడనున్నాయి. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లభించింది. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఉద్దేశించిన అటవీ (సవరణ) చట్టం - 2016 బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈమేరకు అటవీ సవరణ చట్టం - 2016కు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం ఈనెల 19వ తేదీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ చట్ట సవరణ వల్ల ఎర్రచందనం చెట్లు నరికిన, రవాణా చేసిన, దాచి ఉంచిన, స్మగ్లింగుకు సహకరించిన వారికి కఠిన శిక్షలు పడతాయి. గతంలో ఎర్రచందనం కేసులు బెయిలబుల్‌గా ఉండేవి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టం ప్రకారం ఇక నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. ఈ కేసుల్లో నిందితులకు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 10 లక్షల వరకూ జరిమానా పడుతుంది. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం 20 కిలోలకు మించి ఎర్రచందనం నిల్వ చేయరాదు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులను సత్వరం విచారించి దోషులకు శిక్షలలు విధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయనుంది. సాధారణ కోర్టుల్లో విచారణలు పూర్తికాకుండా కేసులు పెండింగులో ఉండిపోతున్నాయి. అందువల్ల ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం సవరణ చట్టంలో పేర్కొంది. ఈ చట్టం ప్రకారం పోలీసు శాఖ నుంచి డీఎస్పీ, అటవీశాఖ నుంచి ముఖ్య అటవీ సంరక్షణాధికారి స్థాయి వారు ఈ కేసులను విచారించే అవకాశం ఏర్పడింది. సవరించిన అటవీ చట్టం - 2016 బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వనీ కుమార్ ఫరీడా ఉత్తర్వులు జారీ చేశారు.