Red scandlers
-
ఎర్రచందనం స్మగ్లర్లకు కఠిన శిక్షలు
- నాన్‌బెయిలబుల్ కేసులు - స్మగ్లర్ల ఆస్తుల జప్తు - అటవీ సవరణ చట్టం - 2016 నేటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లకు ఇక కఠిన శిక్షలు పడనున్నాయి. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లభించింది. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఉద్దేశించిన అటవీ (సవరణ) చట్టం - 2016 బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈమేరకు అటవీ సవరణ చట్టం - 2016కు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం ఈనెల 19వ తేదీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ చట్ట సవరణ వల్ల ఎర్రచందనం చెట్లు నరికిన, రవాణా చేసిన, దాచి ఉంచిన, స్మగ్లింగుకు సహకరించిన వారికి కఠిన శిక్షలు పడతాయి. గతంలో ఎర్రచందనం కేసులు బెయిలబుల్‌గా ఉండేవి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సవరణ చట్టం ప్రకారం ఇక నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. ఈ కేసుల్లో నిందితులకు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 10 లక్షల వరకూ జరిమానా పడుతుంది. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం 20 కిలోలకు మించి ఎర్రచందనం నిల్వ చేయరాదు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులను సత్వరం విచారించి దోషులకు శిక్షలలు విధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయనుంది. సాధారణ కోర్టుల్లో విచారణలు పూర్తికాకుండా కేసులు పెండింగులో ఉండిపోతున్నాయి. అందువల్ల ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం సవరణ చట్టంలో పేర్కొంది. ఈ చట్టం ప్రకారం పోలీసు శాఖ నుంచి డీఎస్పీ, అటవీశాఖ నుంచి ముఖ్య అటవీ సంరక్షణాధికారి స్థాయి వారు ఈ కేసులను విచారించే అవకాశం ఏర్పడింది. సవరించిన అటవీ చట్టం - 2016 బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్వనీ కుమార్ ఫరీడా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
బెంగళూరు: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక స్మగ్లర్ల నుంచి నాలుగు వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేసినట్టు వెల్లడించారు. -
పాపవినాశనం తీర్థం వద్ద దుకాణాల లూటీ
సాక్షి, తిరుమల: తిరుమలలో మంగళవారం తెల్లవారుజామున తొమ్మిది దుకాణాల్లో చోరీ జరిగింది. ఎర్రచందనం కూలీలే ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలోని పాపవినాశనం తీర్థం వద్ద ఉండే దుకాణాల వద్ద రాత్రి వేళల్లో ఎవరూ ఉండరు. ఇక్కడికి సమీప అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. కూలీలు అడవిలోకి ఈ దుకాణాల మార్గంలోనే వెళుతుంటారు. మంగళవారం తెల్లవారుజామున దుకాణాల వద్ద ఎవరూ లేకపోవడాన్ని గమనించిన ఎర్రచందనం కూలీలు మూసిఉన్న దుకాణాల్లో చోరీచేశారు. రూ. 10 వేల నగదు, మరో లక్ష రూపాయల విలువైన వస్తుసామగ్రి చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏకకాలంలో తొమ్మిది దుకాణాల్లో చోరీ జరగడం ఇదే తొలిసారని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే కూలీలే చోరీ చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎర్రచందనం దొంగలను వెలివేయాలి
- టాస్క్‌ఫోర్స్ డిఐజీ కాంతారావు వెంకటగిరిటౌన్ (నెల్లూరు): ఎర్రచందనం దొంగలను జాతి ద్రోహులుగా గుర్తించి సమాజం నుంచి వెలివేయాలని తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో అటవీ, పోలీసుశాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంతారావు మాట్లాడుతూ తిరుపతి ప్రాంతంలో ఎర్రచందన అక్రమ రవాణా తీవ్రత దృష్ట్యా 91 మంది సిబ్బందిని ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతర్జాతీయస్థాయి నుంచి క్షేత్రస్థాయి స్మగ్లర్లు, ఎర్రచందనం అక్రమ రవాణాలో మేస్త్రీలను గుర్తించామన్నారు. వీరిపై పిడియాక్ట్, ఆస్తుల జప్తు వంటి చర్యలు చేపట్టేందుకు న్యాయపరమైన అవరోధాలు రాకుండా పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోర్టులను వినియోగించుకోని ఎర్రచందనం దేశం దాటిస్తున్నారని వెల్లడించారు. వెంకటగిరి సబ్‌డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి, గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగభూషణం, ఎసై్సలు పి వి నారాయణ, వేణుగోపాల్, జిలానీబాషా తదితరులు పాల్గోన్నారు స్మగ్లర్లను చిట్టావిప్పిన డీఐజీ.. ఎర్రచందనం అక్రమరవాణాతో సంబంధం ఉన్న నెల్లూరు జిల్లా వాసుల పేర్లును బహిర్గతం చేశారు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన కారువేమయ్య, నారీ శేఖర్, సత్తు పెంచలయ్య, బుంగా రాజేష్, జి సుమన్, కె హేమసుందరం, ఎ పెంచలయ్య, నరసయ్య, ఖాజారసూల్, మునస్వామిరెడ్డి ( డక్కిలి మండలం), కలవకల్లు శివయ్య, ఎనమల కృష్ణయ్య, ఎగు పెంచలయ్య, పార్లపల్లి మురళీమోహన్, శ్రీనివాసులరెడ్డి, బండి ధర్మయ్య, గోల్కండ పెరుమాళ్లు, వేముల చంద్రశేఖర్‌నాయుడు ( అలియాస్ టైల్స్ రాజా) , సుధీర్‌కుమార్‌రెడ్డిని గుర్తించామని తెలిపారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్‌భాయ్‌తో సంబంధాలు ఉన్న నాయుడుపేటకు చెందిన చంద్రశేఖర్‌నాయుడు ( టైల్స్ రాజా )ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎర్రచందనం అక్రమరవాణా ద్వారా వందల కోట్లు సంపాదించి సమాజంలో పెద్దమనుషుల్లా చలామణీ అవుతున్న వారి చిట్టా తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు.