పాపవినాశనం తీర్థం వద్ద దుకాణాల లూటీ
సాక్షి, తిరుమల: తిరుమలలో మంగళవారం తెల్లవారుజామున తొమ్మిది దుకాణాల్లో చోరీ జరిగింది. ఎర్రచందనం కూలీలే ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలోని పాపవినాశనం తీర్థం వద్ద ఉండే దుకాణాల వద్ద రాత్రి వేళల్లో ఎవరూ ఉండరు. ఇక్కడికి సమీప అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. కూలీలు అడవిలోకి ఈ దుకాణాల మార్గంలోనే వెళుతుంటారు.
మంగళవారం తెల్లవారుజామున దుకాణాల వద్ద ఎవరూ లేకపోవడాన్ని గమనించిన ఎర్రచందనం కూలీలు మూసిఉన్న దుకాణాల్లో చోరీచేశారు. రూ. 10 వేల నగదు, మరో లక్ష రూపాయల విలువైన వస్తుసామగ్రి చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏకకాలంలో తొమ్మిది దుకాణాల్లో చోరీ జరగడం ఇదే తొలిసారని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే కూలీలే చోరీ చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.