హైకోర్టును విభజించాలి
ఆ తర్వాతే న్యాయాధికారుల కేటాయింపులు గవర్నర్‌తో భేటీలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల కేటాయింపులు నిర్వహించాలని, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివేదించారు. శనివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్... గవర్నర్‌తో సమావేశమై హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. న్యాయాధికారుల కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంతోపాటు హైకోర్టు విభజన అంశంపై ఇప్పటివరకు కేంద్రానికి రాసిన లేఖలు, వాటిపై జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, తాజాగా న్యాయాధికారులు, కింది కోర్టుల ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం.
ముందు హైకోర్టు విభజన జరిగితే న్యాయాధికారుల కేటాయింపులో సమస్యలు ఉండవని అందులో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. గవర్నర్ పిలుపు మేరకే కేసీఆర్ ఆయన్ను కలసి ఈ అంశంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. కేసీఆర్ గురువారం కూడా ఇదే అంశంపై గవర్నర్‌ను కలిసి ఈ అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి బొసాలే, తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి శుక్రవారం వేర్వేరుగా గవర్నర్‌ను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ శనివారం మరోసారి గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.