Division of High Court
-
‘విభజన’పై పార్లమెంటులో పోరాడరేం: పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన రహస్య ఒప్పందం వల్లే హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందని మాజీ ఎంపీ, తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రత్యేక హైకోర్టు పోరాటం పేరుతో న్యాయవాదులను మోసం చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలు హైకోర్టు విభజన కోసం పార్లమెంటులో ఎందుకు పోరాటం చేయడం లేదో చెప్పాలి. ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం చేసే పోరాటానికి మేం మద్దతిస్తాం..’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకొని కేటీఆర్ మాట్లాడాలని, కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. -
పార్లమెంట్‌ను స్తంభింపచేస్తాం
హైకోర్టు విభజనపై కేటీఆర్ - పునాదులు కదులుతాయనే ప్రాజెక్టుల అడ్డగింపు - శిఖండి రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించాలి ముస్తాబాద్ : హైకోర్టు విభజన జరిగే వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపచేస్తామని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ సత్తా చూపుతామన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు హైకోర్టు విభజన సీఎం చేతిలోనే ఉందన్నట్లు మాట్లాడుతున్నారని, విభజన అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే రెండు మూడు రోజుల్లోనే విభజన పూర్తయ్యేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కేంద్రం ఇంకా జాప్యం చేయకుండా హైకోర్టు విభజన చేస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. భూ నిర్వాసితులకు జీవో 123 ద్వారా పరిహారం ఇస్తామంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయన్నారు. నిర్వాసితుల బాధలు తెలిసిన కేసీఆర్ రైతులకు న్యాయం చేస్తానంటే ప్రతిపక్షాలు శిఖండి రాజకీయాలు చేస్తున్నాయని, రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దత్తత గ్రామం చీకోడుకు వరాలు మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ముస్తాబాద్ మండలం చీకోడులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి పలు వరాలు ప్రకటించారు. ఇప్పటికే రూ.6.50 కోట్లతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, భవనాలు, బీటీ రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. లక్ష లీటర్ల సామర్థ్యం గల మంచినీటి పథకం, మోడల్‌స్కూల్ బిల్డింగ్, ప్రహరీ, కులసంఘాలకు కమ్యూనిటీ భవనాలు, అర్బన్ ఫీడర్ కరెంట్, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన మెతుకు లావణ్య అనే బాలిక మంత్రికి తన గోడు వినిపించగా, ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరుతోపాటు జీవనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి, చీకొడు గ్రామాల్లో హరితహారంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ తెలిపారు. -
హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే..
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.విఠల్‌రావు హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి. విఠల్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని, ఏపీ ప్రభుత్వం భవనాన్ని మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హైకోర్టును విభజించాలని, తెలంగాణ ప్రాంతానికి చెందిన జడ్జిలు, సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తి వేయాలన్న డిమాండ్‌పై నవ తెలంగాణ అడ్వొకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.విఠల్‌రావు మాట్లాడుతూ రాష్ట్రాల విభజన సమయంలో హైకోర్టు విభజన చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనువైన భవనాన్ని, మౌలిక వసతులు కల్పిస్తే సరిపోతుందన్నారు. రాజ్యాంగ నిబంధనలు అనుసరించి హైకోర్టుల్లో న్యాయమూర్తులను, జిల్లా కోర్టుల్లో జడ్జిలను రాష్ట్రపతి, గవర్నర్లు నియామకం చేస్తారని తెలిపారు. ఒక రాష్ట్రానికి చెందిన జడ్జిలను మరో రాష్ట్రంలో నియామకం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నవ తెలంగాణ అడ్వొకేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. నాగేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ చేసిన తెలంగాణ జడ్జిలను, సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. లేదంటే న్యాయవాదుల పోరాటం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్, శారదా గౌడ్, పి. మోహన్ రావు, పి. పద్మారావు, వెంకటేష్ యాదవ్, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరిష్కారం ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది
హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన సమస్య పరిష్కారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఆయన బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహ్మరెడ్డితో పాటు గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన గురించి గవర్నర్‌తో చర్చించినట్టు చెప్పారు. న్యాయాధికారుల ఆప్షన్స్ విషయంలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయవాదులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రులను కోరినట్టుగా చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని, వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని దత్తాత్రేయ అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ పాతమిత్రులేనని, ఇద్దరూ సమర్థులేనని అన్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగడం బాధాకరమన్నారు. నాగం అభిప్రాయాలు నచ్చకపోతే నిరసన చెప్పవచ్చునని, అయితే భౌతికదాడులకు దిగడం సరికాదని అన్నారు. -
హైకోర్టును విభజించాలి
ఆ తర్వాతే న్యాయాధికారుల కేటాయింపులు గవర్నర్‌తో భేటీలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల కేటాయింపులు నిర్వహించాలని, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివేదించారు. శనివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్... గవర్నర్‌తో సమావేశమై హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. న్యాయాధికారుల కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంతోపాటు హైకోర్టు విభజన అంశంపై ఇప్పటివరకు కేంద్రానికి రాసిన లేఖలు, వాటిపై జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, తాజాగా న్యాయాధికారులు, కింది కోర్టుల ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ముందు హైకోర్టు విభజన జరిగితే న్యాయాధికారుల కేటాయింపులో సమస్యలు ఉండవని అందులో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. గవర్నర్ పిలుపు మేరకే కేసీఆర్ ఆయన్ను కలసి ఈ అంశంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. కేసీఆర్ గురువారం కూడా ఇదే అంశంపై గవర్నర్‌ను కలిసి ఈ అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి బొసాలే, తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి శుక్రవారం వేర్వేరుగా గవర్నర్‌ను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ శనివారం మరోసారి గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఏపీ సీఎం చంద్రబాబు తీరే కారణం
హైకోర్టు విభజనపై సీపీఐ నేత నారాయణ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు సంబంధించిన ప్రస్తుత సమస్యలకు ఏపీ సీఎం చంద్రబాబు తీరునే తప్పుబట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణఅన్నారు. సచివాలయాన్ని మారుస్తున్న విధంగానే తమ కోర్టు తమకు కావాలని చంద్రబాబు ఎం దుకు కోరడం లేదని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలో సంక్షోభపరిస్థితులు ఏర్పడడానికి ప్రధాని మోదీ, చంద్రబాబుల వైఖరే కారణమని ధ్వజమెత్తారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం కలుగజేసుకుని ప్రస్తుత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర విభజన సమస్యలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ స్పందించాలన్నారు. -
సవరణ బిల్లు తీసుకురండి
హైకోర్టు విభజనపై కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ * ఏపీ న్యాయమూర్తులను తెలంగాణకు పంపారు * సమస్య పరిష్కరించకుంటే పార్లమెంటులో ఆందోళన తప్పదు * కేంద్ర మంత్రులతో భేటీ.. వివాదాన్ని పరిష్కరించాలని విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై కేంద్రం సవరణ బిల్లు తేవాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఎక్కడ పనిచేస్తున్న న్యాయాధికారులు అక్కడే ఉండాలంటూ అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను కాదని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ న్యాయాధికారుల కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితర ఎంపీలంతా తెలంగాణ న్యాయవాదులతో వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, డీవోపీటీ మంత్రి జితేంద్రసింగ్, న్యాయమంత్రి సదానందగౌడలను కలిశారు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను వివరించారు. తక్షణం హైకోర్టు విభజన జరగాలని, న్యాయాధికారుల కేటాయింపులపై జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత కె.కేశవరావు మాట్లాడుతూ.. ‘‘సబార్డినేట్ జ్యుడీషియరీ సర్వీసులకు సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం చెప్పిందేమిటంటే... ఒక కమిటీ వేసి విభజన జరపాలని చెప్పింది. దాన్నే ప్రస్తావిస్తూనే అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు మార్గదర్శకాలు వెలువడ్డాయి. కేంద్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఏ రాష్ట్రంలో పనిచేసే న్యాయాధికారులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలని చెప్పారు. అయినా న్యాయాధికారుల కేటాయింపులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ పోస్టుల్లో బదిలీ చేసి పంపారు. ఆప్షన్ ఇవ్వొచ్చన్న సాకుతో ఇలా చేశారు. ముందుగా స్వస్థలం.. తర్వాత ఆప్షన్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలి. మీ ఖాళీల కంటే మీరు ఎక్కువగా ఉన్నప్పుడు.. సర్దుబాటు కానప్పుడు ఇక్కడ సర్దుబాటు చేయొచ్చు. కానీ అలా చేయకుండా తెలంగాణలో నింపేశారు. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడ న్యాయాధికారులుగా నియమితులైన వారు చివరకు హైకోర్టు న్యాయమూర్తులవుతారు. అంటే మరో ముఫ్పై ఏళ్ల వరకు తెలంగాణ హైకోర్టులో కూడా ఏపీ న్యాయమూర్తులే ఉంటారు. తెలంగాణ హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులు ఉండడానికి వీలు లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు’’ అని అన్నారు. ఈ అన్యాయంపై నిరసన వ్యక్తం చేసిన న్యాయాధికారులను సస్పెండ్ చేశారని, ఇది దేశంలోనే మొదటిసారని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ మంత్రులకు వివరించామని, వారికి మొత్తం విషయం అర్థమైందని పేర్కొన్నారు. న్యాయమంత్రి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అన్నారని, తమతో ఏకీభవించినట్టుగా కనిపించిందని చెప్పారు. న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు: ఎంపీ జితేందర్‌రెడ్డి మంచిగా విడిపోయాం. మనుషులుగా కలిసి ఉందాం. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మనోభావాలు రెచ్చగొడుతూ న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు. మాకు రావాల్సిన నీళ్లను అడ్డుకున్నారు. మా నియామకాలను అడ్డుకుంటున్నారు. ఏపీ అనవసరంగా లేనిపోని గొడవలు చేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం. మా హైకోర్టును మాకు అప్పగించాలని, న్యాయాధికారులను విభజించాలని కోరాం. రిజిస్ట్రార్ జనరల్ ఎలా నిర్ణయం తీసుకుంటారు: ఎంపీ వినోద్‌కుమార్ న్యాయాధికారులు తమ సంఘం ద్వారా హై కోర్టు చీఫ్ జస్టిస్‌కు విన్నవించుకున్నారు. చీఫ్ జస్టిస్ నాయకత్వాన కమిటీ వేశారు. ఆ కమిటీలో తేలలేదు. ఏపీలో పుట్టి అక్కడ ప్రాక్టీస్ చేసి న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారిని తెలంగాణకు కేటాయించడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడ్డట్టు అర్థమవుతోంది. దీంతో చీఫ్ జస్టిస్ దీన్ని ఫుల్ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడ తెలంగాణ న్యాయమూర్తులు ముగ్గురు ఉంటే ఏపీకి చెందినవారు 18 మంది ఉన్నారు. వారంతా తెలంగాణ న్యాయాధికారుల కేటాయింపులపై ముందుకెళ్లారు. దీన్ని తప్పుపడుతూ న్యాయాధికారులు నిరసన తెలియజేస్తే చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సస్పెండ్ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ కేటాయింపులపై నిర్ణయం ఎందు కు తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి. మిమ్మల్ని ఎవరు గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పారు? విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. కేంద్రం ఒక కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొంది స్తుందని, అప్పుడు విభజన జరగాలని చెప్పిం ది. కానీ మీరు సొంతంగా ఎలా రూపొందిం చారు? ఏపీ విభజన చట్టం సెక్షన్ 31 సబ్‌క్లాజ్‌లో రెండేళ్లలో రాష్ట్రపతి హైకోర్టుపై నోటిఫై చేస్తారని చెప్పి ఉంటే అయిపోయేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదు. మోదీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సబ్ క్లాజ్ చేర్చండి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే పార్లమెంటులో మా నిరసన తెలుపుతాం. నేడు హైకోర్టు బంద్‌కు పిలుపు టీఆర్ఎస్ ఎంపీల విలేకరుల సమావేశానికి ముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు, అడ్వొకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, జయాకర్ తదితరులు మాట్లాడారు. న్యాయవాదుల అరెస్టులు, న్యాయాధికారుల సస్పెన్షన్‌కు నిరసనగా బుధవారం హైకోర్టు బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయాలని కేంద్రానికి విన్నవించినట్టు తెలిపారు.