పరిష్కారం ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది
హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన సమస్య పరిష్కారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఆయన బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహ్మరెడ్డితో పాటు గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన గురించి గవర్నర్‌తో చర్చించినట్టు చెప్పారు. న్యాయాధికారుల ఆప్షన్స్ విషయంలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయవాదులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రులను కోరినట్టుగా చెప్పారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని, వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని దత్తాత్రేయ అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ పాతమిత్రులేనని, ఇద్దరూ సమర్థులేనని అన్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు దాడులకు దిగడం బాధాకరమన్నారు. నాగం అభిప్రాయాలు నచ్చకపోతే నిరసన చెప్పవచ్చునని, అయితే భౌతికదాడులకు దిగడం సరికాదని అన్నారు.