హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే..
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.విఠల్‌రావు
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి. విఠల్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని, ఏపీ ప్రభుత్వం భవనాన్ని మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హైకోర్టును విభజించాలని, తెలంగాణ ప్రాంతానికి చెందిన జడ్జిలు, సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తి వేయాలన్న డిమాండ్‌పై నవ తెలంగాణ అడ్వొకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.విఠల్‌రావు మాట్లాడుతూ రాష్ట్రాల విభజన సమయంలో హైకోర్టు విభజన చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనువైన భవనాన్ని, మౌలిక వసతులు కల్పిస్తే సరిపోతుందన్నారు. రాజ్యాంగ నిబంధనలు అనుసరించి హైకోర్టుల్లో న్యాయమూర్తులను, జిల్లా కోర్టుల్లో జడ్జిలను రాష్ట్రపతి, గవర్నర్లు నియామకం చేస్తారని తెలిపారు. ఒక రాష్ట్రానికి చెందిన జడ్జిలను మరో రాష్ట్రంలో నియామకం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నవ తెలంగాణ అడ్వొకేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. నాగేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ చేసిన తెలంగాణ జడ్జిలను, సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. లేదంటే న్యాయవాదుల పోరాటం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్, శారదా గౌడ్, పి. మోహన్ రావు, పి. పద్మారావు, వెంకటేష్ యాదవ్, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.