పార్లమెంట్‌ను స్తంభింపచేస్తాం
హైకోర్టు విభజనపై కేటీఆర్
- పునాదులు కదులుతాయనే ప్రాజెక్టుల అడ్డగింపు
- శిఖండి రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించాలి
ముస్తాబాద్ : హైకోర్టు విభజన జరిగే వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపచేస్తామని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ సత్తా చూపుతామన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు హైకోర్టు విభజన సీఎం చేతిలోనే ఉందన్నట్లు మాట్లాడుతున్నారని, విభజన అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే రెండు మూడు రోజుల్లోనే విభజన పూర్తయ్యేదన్నారు.
రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కేంద్రం ఇంకా జాప్యం చేయకుండా హైకోర్టు విభజన చేస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. భూ నిర్వాసితులకు జీవో 123 ద్వారా పరిహారం ఇస్తామంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయన్నారు. నిర్వాసితుల బాధలు తెలిసిన కేసీఆర్ రైతులకు న్యాయం చేస్తానంటే ప్రతిపక్షాలు శిఖండి రాజకీయాలు చేస్తున్నాయని, రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
దత్తత గ్రామం చీకోడుకు వరాలు
మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ముస్తాబాద్ మండలం చీకోడులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి పలు వరాలు ప్రకటించారు. ఇప్పటికే రూ.6.50 కోట్లతో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, భవనాలు, బీటీ రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. లక్ష లీటర్ల సామర్థ్యం గల మంచినీటి పథకం, మోడల్‌స్కూల్ బిల్డింగ్, ప్రహరీ, కులసంఘాలకు కమ్యూనిటీ భవనాలు, అర్బన్ ఫీడర్ కరెంట్, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన మెతుకు లావణ్య అనే బాలిక మంత్రికి తన గోడు వినిపించగా, ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరుతోపాటు జీవనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి, చీకొడు గ్రామాల్లో హరితహారంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ తెలిపారు.