రైళ్లేవీ?
భారీగా వెయిటింగ్ లిస్ట్
కొన్నిటిలో ‘నో రూమ్’
కనిపించని ప్రత్యేక ప్రకటన
‘సంక్రాంతి’ ప్రయాణికుల్లో ఆందోళన
సిటీబ్యూరో: సంక్రాంతికి సొంత ఊళ్లు వెళ్లాలనుకునే వారికి ఈసారి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు చాంతాడులా పెరిగిపోయింది. ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తే తప్ప ప్రజలు పండక్కి బయలుదేరడం సాధ్యం కాదు. మరో వారం, పది రోజుల్లో పిల్లలకు సంక్రాంతి సెలవులు రానున్నాయి. సొంత ఊళ్లలో గడిపేందుకు నగర వాసులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. వీరి ఆశలను ఆవిరి చేస్తూ అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వెక్కిరిస్తోంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. డిమాండ్‌ను, పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపాల్సిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగైనా ముందుకు వేయలేదు. విశాఖ, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ వచ్చే నెలాఖరు వరకు నిండిపోయాయి. చాలా రైళ్లలో ‘నో రూమ్’ బోర్డు వేలాడుతోంది. ప్రత్యేక రైళ్లు నడిపితే కానీ ఎవరూ సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ఏటా తగ్గుతున్న ప్రత్యేక రైళ్లు
ఏటా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండగా... అధికారులు మాత్రం రైళ్ల సంఖ్యను కుదించేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి రోజుకు సుమారు 2 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే లక్షా 50 వేల మంది ప్రయాణిస్తారు. సంక్రాంతి, దసరా వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. సెలవు రోజుల్లో లక్ష నుంచి 2 లక్షల మంది అదనంగా వెళుతుంటారు. సంక్రాంతికి 20 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్తారు. రద్దీ ఇలా పెరుగుతుంటే... ప్రత్యేక రైళ్లు మాత్రం తగ్గిపోతున్నాయి. 2010 నుంచి వీటి సంఖ్యను క్రమంగా తగ్గించేస్తున్నారు. 2010లో సంక్రాంతికి 52 ప్రత్యేక రైళ్లు నడిపారు. 2011 నాటికి వాటిని 40కి తగ్గించారు. ఆ మరుసటి సంవ త్సరం 31 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. గతఏడాది సంక్రాంతి రైళ్లు 30 లోపే ఉన్నాయి. ఈసారి అసలు నడుపుతారా? లేదనేది ఇంతవరకూ స్పష్టం కాలేదు.
ఏజెంట్లకే మేలు
సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలు, వేసవి సెలవుల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడపడంలో దక్షిణ మధ్య రైల్వే ఏటా విఫలమవుతూనే ఉంది. కనీసం నెల రోజులు ముందుగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే ప్రయాణికులకు ప్రయోజనంగా ఉంటుంది. పండగ సెలవులు ముంచుకొచ్చిన తరువాత అప్పటికప్పుడు రైళ్లు వే స్తుంటే పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. రెగ్యులర్ రైళ్లలో బెర్తుల సంఖ్యను పెంచినా ఉపయోగం అంతంత మాత్రమే. ఆగమేఘాల మీద ప్రత్యేక రైళ్లు వేయడంతో ఆ విషయం ప్రయాణికులు గుర్తించేలోపే ఎక్కువ శాతం సీట్లు ఏజెంట్లు ఎగురేసుకుపోతున్నారు.
150 దాటిన వెయిటింగ్ లిస్ట్
ఇప్పటికే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 నుంచి 180కి చేరింది. జనవరి మొదటి వారం నుంచి నెలాఖరు వరకు రైలు ప్రయాణం పూర్తిగా అసాధ్యంగా మారింది. గోదావరి, విశాఖ, గరీబ్థ్,్ర ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ, తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగానే ఉంది. ఈ సంఖ్య ప్రత్యేక రైళ్ల అవసరాన్ని చెప్పకనే చెబుతోంది.