మంచి ‘ఆప్షన్’ అని..
కోఆప్షన్ పదవికి భారీగా దరఖాస్తులు
బరిలో మాజీ కార్పొరేటర్లు... విశ్రాంత అధికారులు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో కో-ఆప్షన్ పదవులపై అనేక మంది కన్నేశారు. కార్పొరేటర్లుగా అవకాశం రాని వారు కనీసం కో ఆప్షన్ సభ్యులుగానైనా ఎన్నిక కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఏకంగా యాభై మంది పోటీలో ఉన్నారు. ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల నియామకానికి ఏప్రిల్ 4 వర కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 దరఖాస్తులు అందాయి. కార్పొరేటర్‌గా టిక్కెట్ లభించని వారితో పాటు మాజీ కార్పొరేటర్లు.. శివారు మున్సిపాలిటీల్లోని మాజీ కౌన్సిలర్లు... కో ఆప్షన్ సభ్యత్వం కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు జీహెచ్‌ఎంసీలో ఇంజినీర్లుగా పని చేసి రిటైరైన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కో ఆప్షన్ సభ్యులకు మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునే అవకాశం మినహా కార్పొరేటర్లకు గల అధికారాలన్నీ ఉంటాయి. కార్పొరేటర్ బడ్జెట్ ఏడాదికి రూ.కోటితో పాటు ఇతరత్రా వారికి గల అన్ని సదుపాయాలూ కోఆప్షన్ సభ్యులకు వర్తిస్తాయి. ఈ పదవులకు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నెల 3న ప్రకటన జారీ చేశారు. తొలుత 21వ తేదీ వరకు మాత్రమే గడువిచ్చారు. ఆ తరువాత ఎన్జీవోల్లో పని చేసిన వారితో పాటు మరికొన్ని వర్గాలకూ అవకాశం కల్పిస్తూ జీవోను సవరించారు. గడువును ఏప్రిల్ 4 వరకు పొడిగించారు.
బరిలో వీరే...
గత పాలక మండలిలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ కొత్త రామారావు... ఓల్డ్ మల్కాజిగిరి కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్... గౌతమ్‌నగర్ కార్పొరేటర్ సుమలత, ఆడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత.. ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ యాదవ్, మూసారాంబాగ్ కార్పొరేటర్ అస్లాంపాషా తదితరులు ఆశావహుల్లో ఉన్నారు. వీరిలో మెజార్టీ సభ్యులు గతంలో టీడీపీలో ఉండగా... ప్రస్తుతం టీఆర్‌ఎస్ గూటికి చే రారు. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహించి... ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరిన వారు సైతం ఉన్నారు. 1986, 2002 పాలక మండళ్లలో కార్పొరేటర్లుగా వ్యవహరించిన వారు సైతం ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మాచర్ల పద్మజ, బండారు లత, లక్ష్మీనారాయణమ్మ తదితరులు ఉన్నారు. గత పాలక మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యురాలిగా వ్యవహరించిన మల్లారపు శాలిని మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పని చేసిన మహేశ్ యాదవ్, శ్రీరాంచందర్ వంటి వారూ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు జీహెచ్‌ఎంసీ(ఎంసీహెచ్)లో గతంలో సూపరింటెండింగ్ ఇంజినీర్లుగా పనిచేసి రిటైరైన ఎంఏ హమీద్, ఫయీముద్దీన్, డిప్యూటీ ఈఈ జయప్రకాష్ నారాయణరావు తదితరులూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి... వీరిలో నుంచి ముగ్గురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునేందుకు పాలక మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ముగ్గురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు.