భారీ ఈవెంట్ల భాగ్యం
చారిత్రక నగరం చరిత్రను తిరగరాస్తోంది. నవనాగరిక దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. ఒకటి వెంట ఒకటిగా వెల్లువెత్తుతున్న విభిన్న రకాల ఈవెంట్లు సిటీని వినూత్నంగా పరిచయం చేస్తున్నాయి. భవిష్యత్‌లో మరెన్నో ఈవెంట్లు నగర వేదికపై నాట్యం చేయనున్నాయి.
ఏవియేషన్ షో లాంటి అధికారిక ఈవెంట్ల పరంపర కొనసాగుతుండగానే మరోవైపు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలూ సిటీలో వెల్లువెత్తుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం వేదికగా దేశంలోనే అతిపెద్ద ఆధునిక సంగీత, నృత్యోత్సవంగా పేరొందిన ‘సన్‌బర్న్’ ఇటీవటే సిటీజనులకు పరిచయమై సూపర్ హిట్టయింది. ఆ పేరు పలికితే చాలు సిటీలోని పార్టీ పీపుల్ ఆలోచనలు, ప్రణాళికలు గోవా దిశగా పరుగు తీసే పరిస్థితిలో మార్పు తెచ్చిందీ ఈవెంట్. స్థానిక కాన్సెప్ట్‌తో రూపొందిన స్కై ఫెస్ట్ కూడా టాక్ ఆఫ్ ది సిటీ అయింది.
వైట్‌తో గ్రేట్..
ట్రెండ్‌కు మరింత ఆజ్యం పోస్తూ వచ్చేసిందే వైట్ సెన్సేషన్. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ ఈవెంట్‌ను సొంతం చేసుకోవడానికి పలు నగరాలు పోటీపడినా ఆసియాలోనే తొలిసారి సిటీకి దక్కడం.. సిటీ ఈవెంట్స్ హబ్ కానుందనే ఆశలకు రెక్కలు తొడిగింది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ భారీ ఈవెంట్‌కు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్ దిగ్విజయంగా పూర్తవడంతో అంతర్జాతీయంగా పేరొందిన ఈవెంట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలు సిటీ వైపు దృష్టి సారించాయి. ఈ తరహా భారీ ఈవెంట్లు నగర పర్యాటక రంగానికి ఊపునిస్తాయనే నమ్మకం ఉంది. ఈ ఈవెంట్‌కు హాజరైన వారిలో 40 శాతం మంది ఇతర ప్రాంతాల వారేనని నిర్వాహకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని భారీ ఈవెంట్లకు సిటీ వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
క్యాంపస్ పార్టీ కమింగ్ సూన్..
ఇన్నోవేషన్, క్రియేటివిటీ, సైన్స్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్టప్స్.. వీటన్నింటినీ కలబోసిన క్యాంపస్ పార్టీ సెప్టెంబర్‌లో సిటీకి రానుంది. ఇది వారం రోజులు కొనసాగుతుంది. ఉదయం టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లు, సాయంత్రం పార్టీలు నిర్వహిస్తారు. దాదాపు 10 వేల మంది యువత టెంట్లలోనే బస చేస్తారు. అలాగే ‘బ్రాడ్ వే మ్యూజికల్స్’ పేరుతో మరో పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ డిసెంబర్‌లో సిటీ చేరనుంది. ఇది దాదాపు 20 రోజులు జరుగుతుంది. ఇలా సెన్సేషన్ విజయం చూసిన తర్వాత టుమారో ల్యాండ్, ఆల్ట్రా.. లాంటి మరెన్నో ఇంటర్నేషనల్ ఫెస్టివళ్లు మన దేశానికి రావాలని చూస్తున్నాయి. ‘సన్‌బర్న్’ ఈ ఏడాది కూడా సిటీలో జరగనుంది. ఈసారి మార్టిన్ గార్రిక్స్, అవిసి, హార్డ్‌వెల్.. లాంటి పాపులర్ డీజేలు సిటీకి రానున్నారు.
ఫెస్టివల్ విలేజ్ అవసరం..
ప్రపంచస్థాయి వినోద సంబరాలను హైదరాబాద్‌కు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్న వేడుకలను మేం పరిచయం చేస్తున్నాం. సన్‌బర్న్, వైట్ సెన్సేషన్.. లాంటి ఈవెంట్లు తీసుకురాగలిగామంటే ఇక్కడి పార్టీ ప్రియుల అభిరుచి, రాష్ట్ర ప్రభుత్వ సహకారమే కారణం. ప్రభుత్వ సహకారం లేనిదే భారీ ఈవెంట్ల నిర్వహణ అసాధ్యం. వైట్ సెన్సేషన్ తర్వాత చాలా మంది ఇక్కడ ఈవెంట్లు చేయాలని చూస్తున్నారు. అయితే ఆడిటోరియం అద్దెకు తీసుకోవడం వల్ల ఈవెంట్లకు చాలా ఖర్చవుతోంది. ఈవెంట్స్ విలేజ్ చాలా అవసరం. అప్పుడు ఏడాదంతా ఈవెంట్స్ నిర్వహించొచ్చు. - విజయ్ అమృత్‌రాజ్, ఓలా ఈవెంట్స్