భారీగా పెరగనున్న ‘బీసీ’ సీట్లు
- 246 హాస్టళ్లలో సీట్ల పెంపునకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు
- సర్కారు ఆమోదిస్తే 5,500 సీట్లు పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగుతున్న కాలేజీ హాస్టళ్లలో త్వరలో సీట్లు పెరగనున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న డిమాండ్ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 246 పోస్టుమెట్రిక్ హాస్టళ్లున్నాయి. వీటిలో 110 హాస్టళ్లు బాలికల కోసం ఏర్పాటు చేయగా.. బాలుర కోసం 136 హాస్టళ్లున్నాయి. ఒక్కో వసతిగృహంలో సగటున వంద మంది విద్యార్థులను చేర్చుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. కానీ స్థానిక పరిస్థితులు, విద్యార్థుల ఒత్తిడితో కొన్నిచోట్ల 150కి పైగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.
అయినప్పటికీ అడ్మిషన్ల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రవాణా చార్జీలు భారంగా మారుతుండటం, తాజాగా మెస్ చార్జీలు పెంచడం, భోజన మెనూలోనూ భారీమార్పులు చోటుచేసుకోవడంతో సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న కాలేజీ హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా కాలేజీ హాస్టళ్లలో ప్రవేశాలకు విద్యార్థులు క్యూ కడుతుండటంతో బీసీ సంక్షేమ శాఖ ఈ మేరకు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించింది.
5,500 సీట్ల పెంపునకు ప్రతిపాదనలు...
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ద్వారా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఒక్కో గురుకులంలో 240 మంది చొప్పున 28,560 మంది విద్యార్థులను 5,6,7 తరగతుల్లో చేర్చుకున్నారు. ఇలా ప్రవేశాలు పొందిన వారిలో 4 వేల మంది విద్యార్థులు బీసీ హాస్టళ్ల నుంచి వచ్చినవారే. దీంతో ప్రీమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఆ సంఖ్యను పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో భర్తీ చేస్తామని సంక్షేమ శాఖ పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిం చింది. ప్రస్తుతం కాలేజీ హాస్టళ్లకు సంబంధించి 5వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రవేశాల డిమాండ్‌ను అధిగమించేందుకు కొత్తగా 5,500 మందిని చేర్చుకునేందుకు అనుమతి కోరుతూ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.