వాన.. హైరానా..
అంతవరకు చల్లగా ఉన్న ఆకాశం చిల్లులు పడ్డట్టు కుండపోతగా వర్షించింది. శనివారం రాత్రి కురిసిన వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి నర్సాపూర్ రాష్ట్ర రహదారి అంధకారంగా మారింది. రెజిమెంటల్ బజార్ నీటమునిగింది. - కుత్బుల్లాపూర్
లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించండి: మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో: వర్షాలతో జలమయమయ్యే లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ కమిషనర్లకు రాష్ర్ట మున్సిపల్ మంత్రి కేటీఆర్ శనివారం సూచించారు. సమాచారం అందగానే వీలైనంత త్వరగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వరదనీరు నిలిచే రోడ్ల వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశముందని, అటువంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.