పలు జిల్లాల్లో భారీ వర్షాలు
పొంగుతున్న వాగులు, గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 4 రోజు లుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులకు జలకళ వచ్చింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా జోరువాన కురిసింది. జిల్లాలో పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు మూడు గేట్లు తెరిచి.. ప్రాజెక్టు నుంచి 21,550 క్యూసెక్కుల వ రద నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఇదే మండలంలోని పెదవాగు, గుబ్బలమంగమ్మ వాగు ఉధృతికి ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది.
ముల్కలపల్లి మం డలం పాములేరువాగు, సాటివాగు ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసానిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 398 అడుగులకు ప్రాజెక్టు నీటిమట్టం చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 16.8 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇల్లెందు నుంచి గుండాల మధ్య వాగు వంతెన డైవర్షన్ తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం, మణుగూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి.
ఓపెన్ కాస్ట్‌ల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
వర్షాలు సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం సింగరేణి వ్యాప్తంగా ఓపెన్‌కాస్టుగనుల్లో 1,55,808 టన్నులకు.. 1,10,375 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఇక భూగర్భ గనుల్లో సైతం 43,615 టన్నులకు.. 27,310 టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. బుధవారం కూడా భారీ వర్షం కురవడంతో మరో లక్ష టన్నులకుపైగా బొగ్గుఉత్పత్తికి అం తరాయం కలిగింది. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. మేడారంలోని జంపన్నవాగు ఎగువ ప్రాంతాల్లో రెండు బ్రిడ్జిలకు ఆనుకుని వరదనీరు పరవళ్లు తొక్కింది. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. సింగరేణి సంస్థ మేడిపెల్లి ఓసీపీలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మహదేవపూర్ మండలంలోని పెద్దంపేట వాగులో ప్రవాహం పెరగడంతో వాగు అవతలివైపు ఉన్న గ్రామాలకు రవాణా స్తంభించింది.
వర్షాలకు గోడ కూలి ఒకరు మృతి
నల్లగొండ జిల్లాలో బుధవారం రోజంతా ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యూరుు. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నారుు. మూసీ నుంచి కాల్వల ద్వారా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షానికి గోడకూలి శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన పల్స పార్వతమ్మ(65) మృతిచెందింది.
మూడు రోజులపాటు భారీ వర్షాలు
ఖమ్మం జిల్లా ములకలపల్లిలో 16 సెం.మీ. వర్షపాతం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు కొనసాగిన అల్పపీడనం బలహీనపడింది. ప్రస్తుతం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిషా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి గురువారం అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రభావంతో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, శుక్ర , శనివారాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు ఖమ్మం జిల్లా ములకలపల్లిలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బూర్గుంపాడులో 13, భద్రాచలంలో 11, పాల్వంచలో 10, కొత్తగూడెంలో 8, మణుగూరు, సిర్పూరుల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పినపాక, అశ్వాపురం, అశ్వారావుపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. బోథ్, కోయిదా, ఏటూరునాగారం, వెంకటాపురం, సత్తుపల్లి, ఆదిలాబాద్, జూలూరుపాడుల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వాన: హైదరాబాద్‌లో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగర రహదారులు జలమయమై పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం, సాయంత్రం రాకపోకలు నెమ్మదిగా సాగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 8.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.