
హైదరాబాద్‌లో జలవిలయం
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ వేగానికి మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఒక పాఠకుడు 'సాక్షి.కామ్ వెబ్‌సైట్'కు ఫోన్ చేసి చెప్పారు. అల్వాల్ జోషినగర్ ప్రాంతంలో ఉన్న చిన్నరాయని చెరువు నుంచి నీళ్లు వేగంగా వస్తున్నాయని.. వాటి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఉదయం నుంచి తాను అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నానని, 2-3 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని వాళ్లు చెబుతున్నా నీటి ప్రవాహం ప్రతి గంటకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదని ఆయన వివరించారు. భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. దాదాపుగా భాగ్యనగరం మొత్తం నీటమునిగింది. రోడ్లపై మోకాల్లోతు వర్షపునీరు నిలిచింది. కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ రైల్వేబ్రిడ్జి దగ్గర కూడా భారీగా వరద నీరు చేరింది. అటు వైపు వెళ్లే వాహనాల్లోకి ఆ నీరు పోవడంతో.... అవి మొరాయించాయి. దీంతో వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయాయి.
మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వర్షాలతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా నీరు చేరడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదులుతున్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది. అర్థరాత్రి నుంచి చాలాచోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు వర్షపునీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానాగర్, సనత్ నగర్, అమీర్ పేట్, మలక్ పేట్, చాదర్ ఘాట్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. రాత్రి కురిసిన వర్షానికి కూకట్ పల్లి బాలానగర్ నాలాల నుంచి భారీగా వరదనీరు సాగర్ లోకి చేరుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్ పల్లి, దోమల్ గూడ, నల్లకుంటతోపాటు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన భవనాలు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో నివసించేవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అధికారులను అదేశించారు. రాత్రి నుంచి జీహెచ్ఎంసి సిబ్బంది, అత్యవసర సహాయక సిబ్బంది వాననీటిని ఎప్పటికప్పుడు నాలాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. మెట్రో మార్గంలో రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలుచోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచింది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)