కోఠీ మెటర్నిటీ ఆస్పత్రిలో హైడ్రామా! | Hidrama at Koti Meternity Hospital | Sakshi
Sakshi News home page

కోఠీ మెటర్నిటీ ఆస్పత్రిలో హైడ్రామా!

Published Wed, Aug 24 2016 10:58 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

కోఠీ మెటర్నిటీ ఆస్పత్రిలో హైడ్రామా!

కోఠీ మెటర్నిటీ ఆస్పత్రిలో హైడ్రామా!

♦  కోఠీ ఆస్పత్రిలో నిన్నటి నుంచి కొనసాగుతున్న ఆందోళన
♦  ప్రసూతి ఆస్పత్రిలో శిశువుల తారుమారు
♦  ఆస్పత్రి ఆయాపై బాలింత రజిత కుటుంబసభ్యుల ఆరోపణ
♦  ఆడబిడ్డ అయితే రూ. 11 వందలు
♦  మగబిడ్డ అయితే రూ. 2 వేల వరకూ వసూలు చేస్తున్నారని ఆరోపణ


హైదరాబాద్: కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో  హైడ్రామా చోటుచేసుకుంది. డబ్బుల కోసం పురిటి బిడ్డలను తారుమారు చేసిన ఆస్పత్రి సిబ్బంది పెద్ద హైడ్రామానే నడిపింది. కేవలం డబ్బుల కోసం ఆశపడి అప్పుడే పుట్టిన శిశువులను తారుమారు చేయడం.. రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపింది. పుట్టిన బిడ్డలను బట్టి ఆడపిల్ల అయితే రూ. 11 వందలు, మగబిడ్డ అయితే 2 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటే ఇలా నిలువుదోపిడీ పాల్పడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మగశిశువు తమ బిడ్డేనని ఇరువర్గాలు పట్టుబట్టడంతో నిన్నటి నుంచి ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పత్తాలేకపోవడంతో రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మాంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగయ్య భార్య రమాదేవిని సోమవారం కాన్పుకోసం ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం కడ్తాల్‌కు చెందిన శత్రు భార్య రజిత కూడా కాన్పు కోసం ఇదే ఆస్పత్రిలో చేరింది. రమాదేవి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నర్సులు, ఆయాలు రమాదేవి అని పిలవడంతో ఆమె కుటుంబీకులకు బదులు రజిత పెద్దమ్మ మసూర్ వచ్చి నిలబడింది.

మీ పాపకు మగ శిశువు జన్మించాడని సిబ్బంది ఆమె వద్ద రూ.వెయ్యి తీసుకొని బాబును అందజేశారు. అనంతరం గంట తరువాత రజిత సైతం ప్రసవించింది. అప్పుడు ఆస్పత్రి సిబ్బంది వచ్చి మసూర్ వద్ద ఉన్న మగ శిశువును మీ బిడ్డ కాదని చెప్పి.. రమాదేవి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో రజిత బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. తమ కూతురికి పుట్టింది మగ శిశువేనని.. ఆస్పత్రి వర్గాలు తారుమారు చేశాయని ఆరోపిస్తూ సిబ్బందిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇరువర్గాల గొడవ నేపథ్యంలో శిశువులను ఆస్పత్రిలోని చైల్డ్‌వార్డ్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా, తమకు పుట్టిన చిన్నారిని ఆస్పత్రి ఆయానే తారుమారు చేసిందని రజిత భర్త ఛత్రునాయక్ ఆరోపిస్తున్నాడు. బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తే కుదరదనీ, డీఎన్ఏ పరీక్ష చేయాల్సిందేనని పట్టుబడ్డాడు. న్యాయం జరిగే వరకు ఆస్పత్రి నుంచి కదిలేది లేదని బాధిత కుటుంబం బైఠాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement