సూసైడ్ నోట్‌లో పేర్లున్నా.. ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదేం?
- ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసులో ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
- ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి కల్పించొద్దు
- చట్ట ప్రకారం వ్యవహరించండి
- పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఫలానా అధికారులు బాధ్యులంటూ ఎస్సై రామకృష్ణారెడ్డి సూసైడ్‌నోట్‌లో రాసినా.. ఆ అధికారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని హైకోర్టు నిలదీసింది. తాము ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి కల్పించకుండా చట్ట ప్రకారం వ్యవహరించడం మేలని హోంశాఖకు స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన పైఅధికారుల వేధింపులు భరించలేక మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి గత నెల 17న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
తన ఆత్మహత్యకు సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌గౌడ్, తొగుట సీఐ రామాంజనేయులు, సిద్దిపేట రూరల్ సీఐ వెంకటయ్య, మరో నలుగురు కానిస్టేబుళ్లు కారణమని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. రామకృష్ణారెడ్డి సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అధికారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. దీనిపై రామకృష్ణారెడ్డి భార్య ధనలక్ష్మి హైకోర్టును ఆశ్రయిం చారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఈ విషయం గా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవా రం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... రామకృష్ణారెడ్డి ఆత్మహత్య వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడంలేదని ఆరోపించారు.
రామకృష్ణారెడ్డి సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్య కు కారణమైనవారి పేర్లను స్పష్టంగా పేర్కొన్నారని.. అయినా వారి పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఆర్‌పీసీ సెక్షన్ 174 ప్రకారం అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని... దర్యాప్తు నిష్పక్షపాతంగా జర గాలంటే సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సూసైడ్‌నోట్ ఆధారంగా బాధ్యులపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆత్మహత్యకు బాధ్యులైన వారి వివరాలు సూసైడ్‌నోట్‌లో ఉన్నప్పుడు వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని హోంశాఖ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించవద్దని.. చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించా రు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.