హైదరాబాద్ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్, కమిషనర్, డీజీపీలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ విమోచన వేడుకలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చానని, దానిని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు.
వేడుకల వల్ల మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినా ప్రయోజనం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వేడుకల నిర్వహణపై స్టే విధించేందుకు నిరాకరించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ తదితరులను ఆదేశించారు.