ఏపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: కర్నూలు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే విషయంలో గడువు కోరడంపై హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. ఎన్నిసార్లు ఇలా వాయిదాలు కోరుతారు.. మీరు కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు ఎన్నికలు పెడతారని మేం అడిగితే ప్రతీసారీ ఏదో ఒక కారణం చెబుతూ వాయిదా కోరుతున్నారు. ఇలా ఇప్పటికే మూడుసార్లు వాయిదా అడిగారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలా వాయిదాలు కోరడం ద్వారా మీరు మా సహనాన్ని పరీక్షిస్తూ వస్తున్నారు అంటూ.. కృష్ణప్రకాశ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కర్నూలు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎప్పటిలోపు ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని, లేనిపక్షంలో తామే నిర్ధిష్ట గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ సర్కార్‌కు హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ తమ ఆదేశాలను అమలు చేయకుంటే ఏం చేయాలో తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పాలక మండలి కాలవ్యవధి ముగిసినప్పటికీ కర్నూలు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం, బుధవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కష్ణ ప్రకాశ్ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మీరు ఈ కేసులో ఇలా వాయిదా కోరడం ఇది మూడోసారి. ఇలా వాయిదాలు కోరుతూ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. కోర్టులో ఏం చెప్పినా జరిగిపోతుందిలే అని అనుకుంటున్నట్లున్నారు అని వ్యాఖ్యానించింది.
ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వి.వి.ప్రభాకరరావు స్పందిస్తూ, ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేసు విచారణను వాయిదా వేస్తున్నామని, ఎప్పటిలోపు ఎన్నికలు నిర్వహిస్తారో, అందుకు సంబంధించిన ప్రక్రియను ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పాలని కృష్ణప్రకాశ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం మధ్యాహ్నం కేసు విచారణకు కృష్ణప్రకాశ్ మళ్లీ వాయిదా కోరారు. ధర్మాసనం మళ్లీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయబోమని, రేపటి వరకు గడువునిస్తున్నామని, ఎప్పటిలోపు ఎన్నికలు నిర్వహిస్తారు, అందుకు సంబంధించిన ప్రక్రియను ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పి తీరాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ చెప్పకుంటే తామే గడువు నిర్ధేశించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని, ఆ ఆదేశాలను అమలు చేయకుంటే ఏమి చేయాలో తమకు బాగా తెలుసునంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.